పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. అర్కునిమూర్తి సర్వకళలందుఁ బ్రవీణుఁడు సంగరస్థలిం
గర్కశరాజలోకలయకాలుఁడు దానవినోది పాపసం
పర్కవిదూరుఁ డార్తపరిపాలనశీలనశాలి విక్రమో
దర్కుఁడు విక్రమార్కుఁ డిట కాతనిఁ బిల్వఁగఁ బంపు నావుడున్. 122

మ. మునివాక్యంబున నింద్రుఁ డిట్టిగుణధాము న్విక్రమాదిత్యుఁ దో
డ్కొని రమ్మా యని పంపె మాతలి నతండుం దేరునం [1]వేగప
చ్చనిగుఱ్ఱంబులఁ బూన్చికొంచు నధికోత్సాహంబుతో మింటిపైఁ
జని యుజ్జేనికి డిగ్గి యచ్చట నృపాస్థానంబు వీక్షించుచున్. 123

మహాస్రగ్ధర—
సభలోనం గాంచె వర్ణాశ్రమజనపరిరక్షాసమారంభలీలా
శుభనిత్యాచారు లోకశ్రుతవిశదనిజస్ఫూర్తిసత్కీర్తిలక్ష్మీ
విభవాకృష్టార్థిజాతాభినుతవితరణాన్వీతహస్తప్రభావ
ప్రభవశ్రీరమ్యు ఖడ్గప్రకటితజయసంపర్కు నవ్విక్రమార్కున్. 124

మ. కని యింద్రుం డిదె నిన్నుఁ బిల్వఁబనిచెన్ క్ష్మాపాల విచ్చేయుమా
యనిన న్గొబ్బున లేచి మాతలికి నాహ్లాదంబుగా నాదరం
బొనరం జేసి మహోత్సుకత్వమున నాయుర్వీశుఁడుం గాముఁడో
యన వచ్చెన్ హరితాశ్వరత్నయుతదివ్యస్యందనారూఢుఁడై. 125

స. వచ్చి కామధేను కల్పతరు చింతామణీ సంతతనివాసంబై యమరు నమరావతీపురంబు సొచ్చి తేరు డిగ్గి మాతలియునుం దోడరా నమరకిన్నరవిద్యాధరయక్షోరక్షనికరపరివారుండును దిక్పాలముకుటతటఘటితమణిగణకిరణారుణితచరణకమలుండును నప్పరోహస్తచామికరదండచారుచామరవ్యజనవీజ్యమానుండును నై సుధర్మాసభామధ్యంబునం దారకితతారాపథమధ్యభాగంబునఁ దారాగణపరివృతుండై వెలుంగు చంద్రునిచందంబు

  1. వేయుపచ్చని