పుట:సత్యశోధన.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

43

రుచించిందని కూడా చెప్పావు. అవసరం లేని చోట మాంసం తిని, అవసరమైన చోట తిననంటున్నావు. ఇది దురదృష్టకరం” అని గట్టిగా అన్నాడు.

ఇట్టి తర్కం రోజూ జరుగుతూ వుండేది. వంద రోగాలకు “తినను” అనే మందు నా దగ్గర వుంది. మిత్రుడు వత్తిడి చేసే కొద్దీ నా పట్టుదల పెరగసాగింది. రోజూ రక్షించమని దేవుణ్ణి ప్రార్ధిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజు రక్షణ జరుగుతూ వుండేది. దేవుడంటే ఏమిటో, ఎవరో నాకు తెలియదు, కాని ఆనాడు “రంభ” చేసిన బోధ నాకు ఎంతో మేలు చేసింది. చేస్తూ ఉన్నది.

ఒకనాడు మిత్రుడు ‘బెంధమ్’ వ్రాసిన పుస్తకం నా ఎదుట చదవడం ప్రారంభించాడు. ఉపయోగాన్ని గురించిన అధ్యాయం అది. భాష, విషయం రెండూ గంభీరంగా వున్నాయి. అర్థం గ్రహించడం కష్టం. ఆయన వివరించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు “క్షమించండి. యింతటి సూక్ష్మ విషయాలు నాకు బోధపడవు, మాంసాహారం ఆవశ్యకమని అంగీకరిస్తాను. కాని నేను చేసిన ప్రమాణాన్ని జవదాటను. దాన్ని గురించి వాదించను. నేను మీతో వాదించి జయం పొందలేనని ఒప్పుకుంటున్నాను. అజ్ఞానిననో, పెంకి వాడననో భావించి నన్ను వదలి వేయండి. మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. మీరు నా హితైషులని నాకు తెలుసు. మీరు నా మంచి కోరి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని తెలుసు. కాని నేను నా నియమాన్ని ఉల్లంఘించలేను. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయే. ఇది అనుల్లంఘనీయం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటలు విని మిత్రుడు నిర్ఘాంతపోయాడు. అతడు ఆ పుస్తకం మూసి “మంచిది, యిక వాదించను” అని అన్నాడు. నేను సంతోషించాను. అతడు మళ్ళీ ఎన్నడూ ఆ విషయమై వాదించలేదు. అయితే నన్ను గురించి బాధపడుతూ వుండేవాడు. అతడు పొగత్రాగే వాడు. మద్యం సేవించేవాడు. నాకు అవి గిట్టవని చెప్పివేశాను. అతడు ఎన్నడూ వాటిని త్రాగమని నాకు చెప్పలేదు. అయితే మాంసం తినకపోతే మూలబడతావని, ఈ విధంగా వుంటే ఇంగ్లాండులో వుండలేవని, వచ్చిన పని పూర్తి చేసుకోలేవని ఆయన చెబుతూ వుండేవాడు.

ఒక నెల ఈ విధంగా గడిచింది. ఆయన ఇల్లు రిచ్‌మండ్‌లో ఉంది. అందువల్ల వారానికి రెండు మూడుసార్ల కంటే లండను వెళ్ళడం కష్టంగా వుండేది. ఇది చూచి డా‖ మెహతాగారు, దలపత్‌రాం శుక్లాగారు మరో కుటుంబం చూచారు. నేను అక్కడ వుండడం మంచిదని భావించారు. వెస్టు కెన్నింగ్టన్‌లో వున్న ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంతో కలిసి వుండటానికి శ్రీ శుక్లాగారు ఏర్పాటు చేశారు. ఆ ఇంటి