పుట:సత్యశోధన.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

నా అభిరుచి

ఓడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మూర్ఖంగా వ్యవహరించి ఒంటికి తామర తగిలించుకొన్నాను. అక్కడ ఉప్పు నీళ్లలో స్నానం చేయవలసి వచ్చింది, ఆ నీళ్లలో సబ్బు కరగదు. నేను సబ్బు రుద్దుకోవడం సభ్యతా లక్షణమని భావించాను. తత్ఫలితంగా శరీరం శుభ్రపడటానికి బదులు జిగటలు సాగింది. దానితో తామర అంటుకున్నది. డాక్టరు మెహతాగారికి చూపించాను. ఆయన మంటలు రేగే యాసిటిక్ యాసిడ్ అను మందు ఇచ్చారు. ఆ మందు నన్ను బాగా ఏడిపించింది.

డాక్టరు మెహతా మా గదులు వగైరా చూచారు. తల త్రిప్పుతూ “ఇలా నడవదు. చదువుకంటే ముందు ఇక్కడి జీవనసరళి తెలుసుకోవడం ముఖ్యo”. అందుకోసం ఏదేని కుటుంబంతో కలిసి వుండటం అవసరం. అయితే అందాకా కొంచెం నేర్చుకొనేందుకు, ఫలానా వారి దగ్గర నిన్ను ఉంచాలని అనుకొన్నాను. ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళతాడు అని చెప్పారు. వారి మాటను కృతజ్ఞతా భావంతో శిరసావహించాను. ఆ మిత్రుని దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను ఆదరించాడు. తన తమ్ముడిలా నన్ను చూచాడు. ఆంగ్ల పద్ధతులు, అలవాట్లు నేర్పాడు. ఇంగ్లీషు మాట్లాడే విధానం కూడా నేర్పాడు.

నా భోజన వ్యవహారం సమస్యగా మారింది. ఉప్పు, మసాలాలు లేని కూరలు రుచించలేదు. ఇంటి యజమానురాలు పాపం నా కోసం యింకా ఏం చేస్తుంది? ఉదయం వరిగల పిండితో జావ చేసేది. దానితో కడుపు కొద్దిగా నిండేది. కాని మధ్యాహ్నం, సాయంత్రం తినడానికి ఏమీ ఉండేది కాదు. పొట్ట ఖాళీ. మాంసం తినమని రోజూ స్నేహితుల ఒత్తిడి పెరిగింది. ప్రతిజ్ఞ సంగతి చెప్పి మౌనం వహించేవాణ్ణి. వాళ్ళ తర్కానికి సమాధానం చెప్పడం కష్టంగా ఉండేది. మధ్యాహ్నం రొట్టె, కూర మురబ్బాతో పొట్ట నింపుకొనేవాణ్ణి. సాయంత్రం కూడా అదే తిండి. రెండు మూడు రొట్టె ముక్కలతో తృప్తి పడేవాణ్ణి. మళ్ళీ అడగాలంటే మొగమాటం. బాగా కడుపునిండా తినే అలవాటు గలవాణ్ణి. ఆకలి బాగా వేస్తూ వుండేది. తిన్నది చాలేది కాదు. మధ్యహ్నం, సాయంత్రం పాలు లభించేవి కావు. అడగటానికి బిడియం. నా యీ పద్ధతి చూచి మిత్రుడు చికాకు పడ్డాడు. “నీవు నా సోదరుడవు అయి వుంటే ఈ పాటికి మూట ముల్లె కట్టించి పంపివేసి వుండేవాణ్ణి. యిక్కడి పరిస్థితులు తెలియక, చదువురాని నీ తల్లి దగ్గర చేసిన ప్రమాణానికి విలువ ఏమిటి చెప్పు! అది లా ప్రకారం అసలు ప్రమాణమే కాదు. అట్టి ప్రమాణానికి బద్ధుడవైయుండటం అజ్ఞానం. ఇదిగో చెబుతున్నా, ఈ పట్టుదల నీకు యిక్కడ ఏమీ ఒరగదు. పైగా నీవు గతంలో మాంసం తిన్నానని, అది