పుట:సత్యశోధన.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

335

జైలుకు వెళ్లడం కంటే చేసిన దొంగ పని సిగ్గు చేటు అని నా అభిప్రాయం. సిగ్గుచేటు అయిన పని జరిగిపోయింది. జైలుకు వెళ్ళవలసి వస్తే ప్రాయశ్చిత్తమని భావిద్దాం. అయితే నిజమైన ప్రాయశ్చిత్తం ఒకటి వున్నది. ఇక భవిష్యత్తులో యిటువంటి దొంగపని చేయనని ప్రతిజ్ఞ గైకొనడమే ఆ ప్రాయశ్చిత్తం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటను సరిగా రుస్తుంజీ అర్ధం చేసుకోగలిగాడని చెప్పలేను. ఆయన మంచి వీరుడు. అయితే అప్పుడు నీరు కారి పోయాడు. ఆయన పరువు పోయే ప్రమాదం సంభవించింది. ఎంతో కష్టపడి చెమటోడ్చి కట్టిన భవనం కుప్ప కూలిపోతుందేమోనన్న భయం ఆయన్ను పట్టుకున్నది. “నా మెడ మీ చేతుల్లో వుంచాను. ఇక మీఇష్టం” అని ఆయన అన్నాడు. వ్యవహారాలలో నాకుగల వినమ్రతా శక్తినంతటినీ వినియోగించాను. అధికారిని కలిశాను. దొంగ వ్యవహారమంతా నిర్భయంగా చెప్పి వేశాను. కాగితాలన్నీ చూపిస్తానని మాట యిచ్చాను. పారసీ రుస్తుంజీ పడుతన్న బాధను, ఆయన వెల్లడించిన పశ్చాత్తాపాన్ని వివరించాను. “ఈ వృద్ధ పారశీకుడు మంచివాడని తోస్తున్నది. ఆయన మూర్ఖపు పని చేశాడు. నా కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా పెద్ద వకీలు ఎలా చెబితే అలా నేను చేయాలి. అందువల్ల మీరు పెద్ద వకీలుకు మీ శక్తినంతా వుపయోగించి నచ్చచెప్పండి.” అని ఆఫీసరు చెప్పాడు. “పారసీ రుస్తుంజీని కోర్టుకు యీడ్వకుండా వుంటే సంతోషిస్తాను” అని అన్నాను. ఆ అధికారి దగ్గర అభయదానం పొంది ప్రభుత్వ వకీలుతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. ఆయనను కలిశాను. నా సత్యనిష్ట ఆయన గ్రహించాడని తెలుసుకున్నాను. నేను ఏమీ దాచడం లేదని ఆయన ఎదుట ఋజువు చేశాను. ఈ వ్యవహారంలోనో మరో వ్యవహారంలోనో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన “మీరు లేదు కాదు చూద్దాం అను సమాధానం పొందే వ్యక్తి కాదు” అని నాకు సర్టిఫికెట్ యిచ్చాడు. పారసీ రుస్తుంజీ మీద కేసు మోపబడలేదు. ఆయన అంగీకరించిన టాక్సు సొమ్ము రెట్టింపు వసూలు చేసి కేసును ఉపహరించవలెనని ఆర్డరు వెలువడింది. రుస్తుంజీ తాను చేసిన పన్నుల ఎగవేతకు సంబంధించిన ఈ దొంగతనం గురించిన కథ వ్రాసి అద్దాల బీరువాలో భద్రపరిచాడు. ఆ కాగితాలు తన ఆఫీసులో తన వారసులకు, తోటి వ్యాపారస్తులకు హెచ్చరికగా వుంచాడు. రుస్తుంజీ సేఠ్ గారి మిత్రులు వ్యాపారస్తులు “ఇది నిజమైన వైరాగ్యం కాదు. స్మశాన వైరాగ్యం సుమా” అని నాకు చెప్పారు. వారి మాటల్లో సత్యం ఎంత వుందో నాకు తెలియదు. ఆ మాట కూడా రుస్తుంజీ సేఠ్‌కు నేను చెప్పాను. “మిమ్మల్ని మోసం చేసి నేను ఎక్కడికి వెళ్ళగలను?” అని ఆయన సమాధానం యిచ్చాడు.


* * *