పుట:సత్యశోధన.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం

కలిగినా ఆఫీసర్లు చాలామంది కళ్ళు మూసుకునేవారన్నమాట. కాచో పారో ఖవో ఆన్, తేవుం ఛే చోరీ సుందన్ (పాదరసం తినడం, దొంగసొత్తు తినడం రెండూ సమానం సుమా) అని ఆ భగవంతుని సూక్తికదా! ఒకసారి పారసీ రుస్తుంగారి దొంగసొత్తు పట్టుబడింది. నా దగ్గరకు పరుగులు తీసాడు. ఆయన కండ్ల నుండి కన్నీరు కారుతున్నది. ‘అన్నా! నేను మోసం చేశాను. నా పాపం ఈనాడు బ్రద్దలయింది. నేను పన్ను ఎగ్గొట్టాను. నాకు జైలుశిక్ష తప్పదు. నాశనం తప్పదు. ఈ ఆపదనుండి నీవే రక్షించాలి. నేను నీదగ్గర ఏమీ దాచలేదు. కాని వ్యాపారంలో చేసే దొంగతనాన్ని గురించి చెప్పడం ఎందుకులే అని భావించి చెప్పలేదు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.’ అని ఘోష పెట్టాడు. ధైర్యం చెబుతూ “నా పద్ధతి మీకు తెలుసు కదా! విడిపించగలగడం, విడిపించలేకపోవడం భగవంతునిమీద ఆధారపడ్డ విషయం. చేసిన అపరాధాన్ని అంగీకరించే షరతులమీద అయితే నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను.

పాపం ఆ పెద్ద మనిషి ముఖం పాలిపోయింది. “మీదగ్గర ఒప్పుకున్నాను కదా! సరిపోదా!” అని అన్నాడు. “చేసిన అపరాధం ప్రభుత్వానికి సంబంధించినది. నా యెదుట అంగీకరిస్తే ప్రయోజనం ఏముంటుంది” అని మెల్లగా అన్నాను. “మీరు చెప్పిన ప్రకారం చేయక తప్పదు. నాకు ఒక పాత వకీలు వున్నాడు. ఆయన సలహా తీసుకోండి. ఆయన నాకు మంచి మిత్రుడు. అని అన్నాడు. రుస్తుంజీ వ్యవహారమంతా పరిశీలించి చూశాను. ఈ దొంగ వ్యాపారం చాలా కాలం నుండి సాగుతున్నదని స్పష్టంగా తెలిసిపోయింది. పట్టుబడ్డ సామగ్రి స్వల్పమే. వకీలును కలిశాం. ఆయన కేసును పరిశీలించాడు. “ఈ వ్యవహారమంతా జ్యూరీ ఎదుటకు వెళుతుంది. ఇక్కడి జ్యూరీ హిందూ దేశస్థుల్ని తేలికగా వదిలే రకం కాదు. అయినా వదలను” అని అన్నాడు. ఆయనతో నాకు పరిచయం తక్కువ. పారసీ రుస్తుంజీ ఆయన మాటను విని “మీకు ధన్యవాదాలు. అయితే ఈ వ్యవహారంలో నేను గాంధీగారి సలహా ప్రకారం నడుచుకుంటాను. ఆయన నన్ను బాగా ఎరుగును. మీరు వీరికి అవసరమైన సలహాలు యిస్తూవుండండి” అని అన్నాడు. ఈ వ్యవహారం అక్కడ ముగించి మేము రుస్తుంజీ కొట్టు దగ్గరకు వచ్చాం. “అసలు ఈ విషయాన్ని కోర్టుదాక పోనీయకూడదని అలా పోవడం మనకు మంచి పని కాదని అభిప్రాయపడ్డాను. కోర్టుకు వెళ్లడమా లేదా అని నిర్ణయించేవాడు టాక్సు వసూలు చేసే అధికారి. అతడు కూడా ప్రభుత్వ వకీలు సలహా ప్రకారం నడుచుకోవలసి వుంటుంది. నేను ఆ యిద్దరినీ కలుస్తాను. అయితే ఒక్క విషయం వాళ్లకు తెలియని అనగా వాళ్లకు పట్టుబడని దొంగతనాలు కూడా నేను వారికి చెప్పవలసి వుంటుంది. వారు విధించే శిక్షను అనుభవించేందుకు సిద్ధపడదాం.