పుట:సత్యశోధన.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

197

అయిపోయిన తరువాత మేము ఫిరంగి గుండ్లు, తుపాకీ గుండ్లు పడే చోట పనిచేయుటకు పూనుకున్నాము. అప్పుడు రోజుకు 20 లేక 25 మైళ్ళ వరకు తిరిగి పనిచేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సారి దెబ్బలు తిని గాయపడిన వారిని డోలీల్లో మోసుకొని అంతదూరం నడిచి రావలసి వస్తూ వుండేది. ఆవిధంగా గాయపడిన వారిలో జనరల్ వుడ్‌గేట్ వంటివారున్నారు. అట్టి యోధుల్ని చేరవేసే అదృష్టం మాకు కలిగింది.

ఆరువారాలు విశ్రాంతి లేకుండా పని చేసిన పిమ్మట మాదళాన్ని విడుదల చేశారు. స్పియాంకోపును, వాల్‌క్రాంజును చేజార్చుకున్న పిమ్మట లేడీస్మిత్ మొదలగు స్థావరాలను బోయర్లు ముట్టడించేసరికి, వారి పట్టు నుండి వాటిని విడిపించడం కోసం పూనుకోకుండా ఇంగ్లాండు నుండి, ఇండియా నుండి సైన్యాలను రప్పించాలని నిర్ణయించుకొని, అంత వరకు మెల్లమెల్లగా పని చేయాలని బ్రిటీష్ సేనాపతి నిశ్చయించుకున్నాడు.

మేము చేసిన ఆ స్వల్ప కార్యానికి ఆ సమయంలో మమ్మల్ని అంతా ఘనంగా మెచ్చుకున్నారు. దీనివల్ల భారతీయుల ప్రతిష్ట పెరిగింది. “అహో ! భారతీయులననెవరో కాదు ఈ రాజ్యపు వారసులే,” అను మకుటంతో పద్యాలు పత్రికల్లో వెలువడ్డాయి. జనరల్ బులర్ మాసేవల్ని ప్రశంసించాడు. మా దళపు నాయకులకు మెడల్సు కుడా లభించాయి.

ఇందువల్ల భారతీయుల్లో ఐక్యత పెరిగింది. నాకు గిరిమిటియాలతో సంబధం పెరిగింది. వారిలో కూడా వివేకం పెరిగింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు. మద్రాసీ, గుజరాతీ, సింధూ, అంతా హిందూ దేశస్థులేనను భావం ప్రబలింది. ఇక భారతీయుల కష్టాలు తొలగిపోతాయని అంతా భావించారు. అప్పటి నుండి తెల్లవారి నడతలో మార్పు వచ్చింది.

యుద్ధ సమయంలో తెల్లవారికి, మాకు మధురమైన సంబంధం ఏర్పడింది. వేలాదిమంది తెల్లసోల్జర్లతో మాకు సంబంధం ఏర్పడింది. వారు మాతో ఎంతో స్నేహంగా వ్యవహరించారు. మేము తమకు చేసిన సేవా శుశ్రూషలకు వారు ఎంతో కృతజ్ఞత తెలియజేశారు.

దుఃఖ సమయంలో మనిషి హృదయం ఎంత ద్రవిస్తుందో ఒక్క ఉదాహరణ పేర్కొంటాను. మేము చీవలీ శిబిర ప్రాంతంలో సంచరిస్తున్నాము. రాబర్ట్సు ప్రభువు పుత్రుడు లెఫ్టినెంట్ రాబర్ట్స్‌గారికి ప్రాణాంతకమగు గుండు దెబ్బ తగిలింది. ఆయన