పుట:సత్యశోధన.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవభాగం

1. తుపాను చిహ్నాలు

కుటుంబ సభ్యులతో బాటు నేను ఓడమీద ప్రయాణం చేయడం యిదే ప్రథమం. మధ్యతరగతి హిందూ కుటుంబాలల్లో బాల్యవివాహాలు జరుగుతూ వుంటాయని, భర్త చదువుకున్నవాడు గాను- భార్య నిరక్షర కుక్షిగాను వుంటుందని అనేక చోట్ల వ్రాశాను. భార్యాభర్తల జీవితంలో సముద్రమంత అంతరం వుంటుంది. భర్త భార్యకు ఉపాధ్యాయుడు అవుతాడు. నేను నా భార్యాబిడ్డల వేష భాషల మీద, ఆహార విహారాదులమీద దృష్టి సారించాను. వాళ్ళకు ఎట్లా నడుచుకోవాలో బోధించడం అవసరమని భావించాను. అప్పటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకుంటే యిప్పుడునాకు నవ్వు వస్తుంది. హిందూ స్త్రీ పతిభక్తియే తన ధర్మమని భావిస్తుంది. భర్త దేవుడని భావిస్తుంది. ఆ కారణం వల్ల భర్త ఎలా ఆడిస్తే అలా భార్య ఆడవలసి వస్తుంది.

మనం నాగరికులం అని అనిపించుకోవాలంటే తెల్లవారిని అనుకరించాలి. అలా అనుకరిస్తేనే మన పలుకుబడి పెరుగుతుంది, అలా చేయకపోతే లాభం లేదని ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాణ్ణి. యీ కారణాలవల్ల నా భార్యాబిడ్డలకు నేనే దుస్తుల్ని నిర్ణయించాను. నా పిల్లల్ని చూచి లోకులు కాఠియావాడు కోమట్లండోయ్ అని అంటే ఓర్వగలనా? పార్సీ వాళ్ళు అందరి కంటే నాగరికంగా వుంటారని ప్రతీతి. అది గమనించి నా భార్యకు, పిల్లలకు తెల్లవాళ్ల డ్రస్సు వేయకుండా పార్సీ డ్రస్సు వేయాలని నిర్ణయించాను. నా భార్యకు పారసీ పద్ధతి చీర, పిల్లలకి పారసీలకోటు, పాంట్లు, అందరికి బూట్లు, మేజోళ్ళు కొన్నాను. నాభార్యకు, పిల్లలకి కొంతకాలం దాకా ఇవి నచ్చలేదు. బూట్లు వేసుకుంటే కాళ్లు కరిచాయి. మేజోళ్ళు వేసుకుంటే చెమట. బొటనవ్రేళ్ళు బిగదీసుకు పోయాయి. వాళ్ళు వద్దన్నా నేను అంగీకరించలేదు. నామాటల్లో అధికార భావం ఎక్కువగా పనిచేసింది. అందువల్ల పాపం ఏం చేస్తారు? నా భార్య, పిల్లలు ఆ దుస్తులే ధరించారు. అదే విధంగా యిష్టం లేకపోయినా భోజనం ఇంగ్లీషువాళ్ళ విధానంలో చేయడం ప్రారంభించారు. నాకు వ్యామోహం తొలగినప్పుడు వాళ్ళు డ్రస్సు, ఫోర్కులు, ముళ్ళగరిటెలు వగైరాలు విడనాడి మామూలు పద్ధతికి

168