పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

శ్రీ దేవీ భాగవతము


క. సూతునివెలఁదుక రాధ మ హాతతమతి దాదిఁ జూచి యది యెద్దియనం
   బ్రీతిమెయి నిజముసెప్పగ | నాతనయుని జేసికొందు నా కిమ్మనినన్.186

తే.గీ. రాధ దాఁ బెంచెఁ గర్ణుని రహి నతండు | సూతునింటను బెరిగి విఖ్యాతుఁడయ్యె
   నతిబలుండని జగమెల్ల నభిసుతింప | నతని మహిమంబుఁ దెలియు భారతమునందు.187

తే.గీ. పిదప బాండుని వరియించె భీతహరిణ | నేత్ర కుంతి స్వయంవర నిపుణయగుచు
   మద్రరాజు కుమారిక మాద్రియనెడు  ! భామినియుఁ బాండు రెండవ భార్యయయ్యె.188

తే.గీ. వేటకని పాండురాజు దా విపినమునకుఁ బోయి మృగరూపు నొకముని నేయ నతఁడు
   శాపమిచ్చెను నీకు స్త్రీ సంగమంబు గలిగినప్పుడె మరణంబు గలుగునంచు.189

క. అది విని శోకాకులుఁడై | వదిలెను రాజ్యం బరణ్యవాసము సేసెన్
   మదవతు లిద్దరు దనకున్ ముదమున బరిచర్యసేయ మునుకొని యచటన్.190
 
సీ. మందాకినీ తీరమందు ఋష్యాశ్రమంబుల నుండి తపమును సలుపుకొనుచు
    మునిముఖ్యులు పురాణములు ధర్మశాస్త్రముల్ చదువంగఁ జెవులొగ్గి చాలవినుచు
    సుతులు లేకున్నను గతులు లేవను నట్టివాక్యమొక్కటి విని వనటఁ బొగిలి
    అండజుండును మహితాత్మజుండును క్షేత్రజుండును మరి గోళకుండు కుండుఁ

తే.గీ. డును సహోఢుండు కానీనుఁడును దలంపఁ గ్రీతుఁడును బ్రాప్తుఁడును బరికింప దత్తు
   డనెడువా రుత్తరోత్తర మల్పతరులు ననుచుఁ దా నెంచి కుంతితో ననియె నిట్లు.191

క. నా యాజ్ఞను గైకొని యో ప్రేయసి తాపసుని గూడి ప్రియపుత్రుని స
   న్న్యాయమున గనుము నా విని | యాయమ యిట్లనియెను నుర్వరాధీశునకున్.192

తే.గీ. తొల్లి దుర్వాసుఁ డధిక సంతోషమునను నాకొసఁగె మంత్రమొక్కటి నాథదాని
   వలనఁ గోరిన దేవుఁడు వచ్చి యిచ్చు వరమనుచుఁజెప్పి పతియాజ్ఞ వడసి పిదప.193

సీ. ధర్ముని జపియించి తద్వరంబునఁ జేసి శ్రీమంతుఁడగు యుధిష్ఠిరునిఁ గనియె
   వాయువుఁ బ్రార్థించి వానివరము గాంచి పృధుబలుడైనట్టి భీముఁ గనియె
   నమరేంద్రు బ్రార్థించి యతని వరంబున సుప్రభుండైనట్టి యర్జునునిఁ గనియె
   వర్షవర్షంబున వరుసగా మువ్వుర సుతులను బడసి యా సుదతి యలరె

తే.గీ. నంత మాద్రియు మదిని బుత్త్రాభిలాషఁ బతినిఁ బ్రార్థించి యానతిం బడసి కుంతి
   నడిగి మంత్రంబుగైకొని యశ్వినులనుదలచి నకులుని సహదేవు దాను గనియె.194

తే.గీ. ఇట్టులా కాననంబున జుట్టి తిరుగు చుండ నొకనాడు మాద్రిని పాండురాజు
   వలదు వలదన్న వినక దా వలపుదగిలి | కూడె నంతట ధరణిపై గూలె నతడు.195