పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

శ్రీ దేవీ భాగవతము

ఉ. పుట్టిన పుత్రునిం గని ప్రమోదమునం జరిగించె చేతనై
    నట్టులు జాతకర్మ మొదలైనవి దానికి నోర్వ కిందుఁ డా
    పట్టున కంపె నొక్క భటుఁ బట్టిని నా కిడు మంచు గట్టిగాఁ
    బుట్టెను వాఁడు నా కనుచు బొంకులు కా వనుచు న్వచింపగన్.4198

ఉ. దూత వచించు మాట విని దొంగయ తామరగొంగ వింటిరా
    కూతలు నా మొగంబునకుఁ గూన మొగం బెనఁబెట్ట నొప్పెడిన్
    బ్రీతిగ జాతకర్మసముపేతుని జేసితి నేన కాదొకో
    యీ తరి బిడ్డ నియ్య నగరే జను లంచు వచించి పంపినన్.420

ఆ.వె. మరల గ్రతుభుజులకు మాంసాశనులకును | బ్రాప్తమైన పోరు బ్రహ్మ చూచి
    వచ్చి యుద్ధసీమ నచ్చెరువడి యంద | ఱాలకింప నిట్టు లనుచుఁ బలికె. 421

క. తారా! పదనఖనిర్జిత తారా! సురలోకగురుని దారా! యిటకున్
    రారా తెలుపుము గురుఁడా | రేరేడా వీని తండ్రి ఋత మెఱుగుదకా.422

సీ. సందడించుచు గిల్కుటందె వాదోడుగాఁ | దొడిఁబెంపుఁ జిల్క చేదోడుగాగఁ
    జక్కని మోవిపై ముక్కెర కదలఁగా | గుబ్బ కస్తురితావి గుబులుకొనఁగ
    నునుసిగ్గు దలవాంచి కనులఁ బ్రక్కల దిద్ద | ముసిముసినగవు సొంపులుఘటింప
    మణిముద్రికల వ్రేళ్ళు మఱిపైఁట సవరింప | ముసుఁగుసరిగ జడ మొదల ముసర
తే.గీ. గునిసి కౌనాడ గదిగుమ్మమునకు వచ్చి | తలుపు నొకకొంత యోరగా మలచి నిలచి
    తార ముద్దులు గార విధాత కనియె | నితడు నిజముగ నమృతాంశుసుతుఁ డటంచు. 423

ఆ.వె. వన్నెలాడి రాజు వదనంబుఁ గనుగొని | చిన్నతనముచేతఁ జేసె దప్పు
    తప్పు చెలియఁ జెప్పి యొప్పించినంతనే | మగని గలసి సుఖనిమగ్నయయ్యె. 424

వ. అని చెప్పిన సూతుండు మరియు నమ్మహనీయు లగు మునిశ్రేష్ఠుల కిట్లనియె.425

క. ఆ సుతునిం దాఁగొని నిజ | వాసమునకుఁ బోయి యంత వారిజరిపుఁ డు
   ల్లాసమునఁ బొంగి బుధుఁ డను | భాసురనామంబు పెట్టె బలు ప్రేమ మెయిన్.426

క. కమలజుఁడును సురలును దమ | తమ గృహముల కేగిరనుచుఁ దప్పక చెప్పెన్
   విమల బుధోత్పత్తిక్రమ | మమిత మనోహరము కరము నద్భుతము సుమీ.427

ఆ.వే. బుధునకు నిళయందుఁ బుట్టె ధర్మపరుండు యజ్వయగు పురూరవాఖ్య నృపతి
   దానపరత నత్యుదారకీర్తి వహించి | జగము నేలుచుండు సమయమందు.428

క. సుద్యుమ్న నామ భూపతి | ప్రద్యోతనుఁ డగుచు సత్య పరిపాలన సం
   పద్యుక్తిఁ బొనరె నాతఁడు | హృద్యస్థితి సైంధవంబు నెక్కి మృగయకై. 429