పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

71


ఆ.వె. గురుని మీఁద వలపు గోరంతయును లేదు | నన్ను ఖిన్నుఁజేసి నాతి చనదు
      దైవనాధు నాజ్ఞఁ దలమ్రోతు నే నెట్టు | లెట్టు వచ్చినాఁడ వట్టె చనుము. 405
 
శా. ఆ మాట ల్విని దేవదూత హరి డాయంబోయి యో దేవ నే
       నా మందాత్ముని మందలించిన నతం డాలింపఁ డాయెన్ భవ
       త్సామర్థ్యం బెఱుగం డటంచుడుఁ బలుకన్ దైత్యారి చక్రేశుఁ
       గ్రామర్షంబున యుద్ధయాత్ర యిఁక నిక్కం బంచు నూహించుచున్.406

తే.గీ. గురుని యెడనున్న పెంపగుఁ గూర్మిచేత జంద్రుయుద్ధంబు చాటించె నింద్రు డపుడు
      ఔర సమయంబు దొరికె నా కనుచు నిక్కి | శుక్రుఁ డిట్లని జాబిల్లి చూచి పలికె. 407

శా. ఓయీ చంద్ర మహేంద్రు డెంత సమరంబో యుక్తమీ పట్టునం
      జేయం జొత్తుము నేను రాక్షసులు నిశ్చింతన్ సహాయక్రియల్
      వేయేలా యొకమాటఁ జెప్పెదను గర్విష్ఠుండు కాడే గురుం
      డీయంబోకుము దార నాయెడను లేదే మంత్రశక్తుల్ కడున్. 408

వ. అనిపలికి భార్గవుం డసురులం బురికొల్పిన.409

తే.గీ. యుద్ధసన్నద్ధులై సుర లుగ్రు లగుచు | నరుగు దేరంగ రక్కసు లురువడించి
     మోహరించిన గదనం బమోఘమహిమ | బెక్కుహాయనములు నిండె నొక్కరీతి. 410

క. దేవాసుర యుద్ధముగని | దేవజ్యేష్ఠుండు హితమతిన్ హంసపయిన్
     దా వేగ రణస్థలికిన్ | వావిరిఁ జనుదెంచి పలికె వనజరిపునితోన్.411

క. విడువుము గురుసతి సేమము | గుడువుము పరసతుల నిట్లు కోరుట తగునా
     కడలి బుడుత కాకున్నసు | జడధిశయనుఁ బిలచి నీకు క్షయ మొనరింతున్.412

వ. అని మఱియు శుక్రుం జూచి యిట్లనియె.413

క. నీ విట్లు సేయఁ దగునే | సావాసమువలన నీకు జడమతి యొదవెన్
     నావిని శుక్రుడు చంద్రునిఁ | బో విడచుట మే లటంచు బుద్ధిందలచెన్.414

ఆ.వె. తలఁచి చంద్రుఁ జూచి దైత్యగురుండు ప్రా | లేయకిరణ గురుని జాయ నతని
     కిచ్చివేయు మనుచు నిపుడ నీజనకుండు | సెప్పఁ బంపె నట్లు సేయుమనిన.415

ఆ.వె. భృగునిమాట లెంత వింతలాయె నటంచు | నాత్మనెంచి సురవరార్యు భార్య
     గర్భవతి నొసంగి కమలారి పంపిన | గురుడు చనియె భార్యఁ గూడి గృహము.416

ఆ.వె. పరులచేత జిక్కి పలునాళ్ళు తన సాగు | బడినిలేని పొలము బాగుసేసి
     పరగ దున్ని విత్తి పండించి యిచ్చిన | బంటకాపుఁ బోలెఁ బాపఁడలరె.417

ఆ.వె. అంత గొంతకాల మరుగంగ నొక శుభ | వాసరమున రమ్య వదనుడైన
     తనయుఁ డుద్భవించెఁ దారకు సురగురు | దార కతడు సారసారిఁ బోలె.418