పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

91


తలఁపుతోఁ దరలెనంతను వాని యింట
నెలనాఁగ కూరపా దిలఁ ద్రవ్వుటయును 340
పెన్నిధానముగాంచె పృథివీశ్వరుండు
మన్నన నవ్విప్రమణి గౌరవంబు
పరికించి నిజహితప్రకరంబుచేత
వరధనభూషణవ్రాతముల్ పనిచె
చేలు మళ్లును దుక్కి సేయ కెంతయును
మేలుపంట ఫలించె మిక్కిలి సిరులు
పూటపూటకు హెచ్చె పుత్రులు నేర్పు
పాటిల్ల విద్యల ప్రౌఢిఁ జేకొనిరి
ఇటులసంపదమించు నింటికి నతఁడు
పటుతేజ ముప్పొంగ పరతెంచునపుడు 350
వారలబంధువుల్ పండితో త్తములు
దూరం బెదుర్కొని స్తుతులు సేయంగ
వచ్చి యచ్చెలువ నావరకుమారులను
గ్రుచ్చి కౌగిటఁ జేర్చుకొని యూరడించి
శ్రీకాంతపదభక్తి చెలగంగ సిరులు
గైకొని కొన్నాళ్లు కడుసుఖంబుగను
సకలధర్మంబులు సలుపుచునుండె
సకుటుంబమున వృషాచలసమీపమున
కరిగి నిత్యనివాస మందుఁజేయుచును
హరిచరణాంబుజధ్యానయోగంబు 360
సాగించి యోగియై సంసారసంభ
వార్తి దొలఁగ ముక్తి హరికృపఁ గాంచె