పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీఖండమున శ్రీనాథకవిసార్వభౌముడు తన రచనములగూర్చి యీ విధముగా చెప్పియున్నాడు.

సీ. చిన్నారి పొన్నారి చిఱుతకూఁకటినాఁడు | రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాల నూత్నయౌవనమున | శాలివాహనసప్తశతి నొడివితి
    సంతరించితి నిండు జవ్వనంబునయందు | హర్షనైషధ కావ్య మాంధ్రభాషఁ
    బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని- | యాడితి భీమనాయకుని మహిమఁ
గీ. బ్రాయ మెంతయు మిగులఁ గై వ్రాలకుండఁ | గాశికాఖండమను మహాగ్రంథ మేను
    దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక- |పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. (I-7)

ఇందులో మొదటి రెండుకృతు లిప్పటికి లభించలేదు. నైషధము పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ. 1402-1420) మంత్రి మామిడి సింగనామాత్యున కంకితము. భీమేశ్వరపురాణము అల్లయ వీరభద్రారెడ్డి (క్రీ.శ. 1423-1448) మంత్రి బెండపూడి యన్నయమంత్రి కంకితము. కాశీఖండము వీరభద్రారెడ్డి (క్రీ.శ 1423-1448) కంకితము. పై పద్యమున పేర్కొనని కృతులు హరవిలాసము, శివరాత్రిమాహాత్మ్యములు. హరవిలాసము శ్రీనాథుని బాల్యసఖుడును, కుమారగిరిరెడ్డి (క్రీ.శ. 1386-1402) కడ సుగంధభాండాగారాధ్యక్షుడుగా నుండినవాడునగు అవచి తిప్పయసెట్టి కంకితము. ప్రకృతగ్రంథమైన శివరాత్రిమాహాత్మ్యము శ్రీశైల మందలి భిక్షావృత్తిమఠాధ్యక్షులగు శాంతభిక్షావృత్తియతీశ్వరుల మూలభృత్యుడు ముమ్మయ శాంతయ కంకితము. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు శ్రీనాథుని పేరుతో ప్రకటించిన పల్నాటి వీరచరిత్ర మాతని కృతి కాదనియు, దాని రచయిత మరియొక శ్రీనాథుడై యుండుననియు శ్రీ శిష్టా రామకృష్ణశాస్త్రిగారి యభిప్రాయము. [1]శ్రీనాథుడు రచించిన కాటమరాజు కథ, పండితారాధ్యచరిత్ర, ధనంజయవిలాసములు కూడ లభించలేదు. వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామమున శ్రీనాథుని తోడ్పాటున్నట్లు పండిత పరిశోధకుల తీర్మానము. శ్రీనాథుని పేరుతో చాటువు లనేకములు ప్రచార మందున్నవి. [2]వీనిలో శ్రీనాథునివేవో కానివేవో శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు నిష్కర్ష చేసియున్నారు. [3]ఇట్టి కృతులే కాక శ్రీనాథుడు రచించిన ఉపలభ్య శాసనముల వివరములు శ్రీ చాగంటి శేషయ్యగా రిచ్చి యున్నారు.[4] శివరాత్రిమాహాత్మ్యము: శ్రీనాథుని జన్మస్థలము, జననకాలములవలెనే ఆతని గ్రంథముల పౌర్వాపర్యము కూడ వివాదాస్పదము. వీరేశలింగంపంతులుగా రిది భీమఖండమునకు పూర్వకృతి యనిరి. నాగపూడి కుప్పుసామయ్యగా రిది శ్రీనాథుని బాల్యకవిత యనిరి. కాని జీవితము ప్రొద్దువ్రాలు సమయమున ఆశ్రయులు, దాతలు అడుగంటిపోయిన తరువాత శ్రీనాథుడు చిత్తశాంతికై శ్రీశైలక్షేత్రమునకు కడపటిసారిగా పోయి శాంతభిక్షావృత్తియతీశ్వరుల యాదేశమున క్రీ.శ. 1440 ప్రాంతములందు దీనిని రచించినట్లు [5]శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారు నిర్ణయించినారు. శ్రీయుతులు [6]వేటూరి ప్రభాకరశాస్త్రి, [7]బండారు తమ్మయ్య, [8]చాగంటి శేషయ్యగారలు తదితరు లందరును అటులే తలంచినారు. ఇటీవల [9]శ్రీ చన్నాప్రగడ తిరుపతిరావుగారు శ్రీనాథుని వివిధపద్యముల శాతమునుబట్టి దీనిని కాశీఖండమునకు పూర్వరచన మన్నారు.

శివరాత్రిమాహాత్మ్యమందలి అవతారిక మరియు ఆశ్వాసాంతపద్యములు శ్రీనాథుని రచనములు కావని శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారి అభిప్రాయము. కాని యవి కూడ శ్రీనాథవిరచితములనియే నా నమ్మకము. ఇన్నాళ్ళకు మనకు లభించిన ఒండురెండు శిథిలప్రతు లాధారముగా అవతారికాభాగము శ్రీనాథునిది కాదనుట సమంజసము కాదు. శివరాత్రిమాహాత్మ్యము జంగము మఠములందు తలదాచికొని కొనయూపిరితో నిలిచినది. దానిని చదువుకొనుచు పుత్రికలు వ్రాసికొనుచు ఇన్నాళ్ళు బ్రతికించినవారిలో పండితులెందరో కానివారెందరో తెలియదు. అవతారికలో కొన్ని పద్యములు శిథిలములైపోగా నెవరైన పూరించి యుండవచ్చును లేదా వ్రాయసకాని పొరపాటులేమైన చేరియుండవచ్చును. కాలక్రమమున పాఠాంతరములు ప్రవేశించి యుండును. శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారు చూపిన పండ్రెండు దోషములలో ఒకటి,

“సకల సద్గుణ విఖ్యాత సారసాఖ్య
మహిత పంచాక్షరీమంత్ర మానసాత్మ”

యనునది. ఇది క్రొత్తగా లభించిన తాళపత్రగ్రంథమందలి పాఠాంతరములవలన (I-30) నిర్దుష్టమైపోయినది.

“కాకోదరగ్రామణి కంఠగ్రైవేయు” (I-64) అనునది వచనములోని భాగము. తాళపత్ర గ్రంథములందు గుడిదీర్ఘము లుండవని విజ్ఞు లెరుగుదురు. కనుక దీనిని ‘గ్రామణీ’ యని తలచవలెను. వారెత్తి చూపిన తక్కిన పది దోషములును అప్రౌఢకవితాబంధములును ఈ క్రొత్త తాళపత్ర గ్రంథమున గూడ నటులే యున్నందున వాని నట్లే యుంచినాను. వీనిలో “వడి ప్రాస విడంబబంధమై” (I-16) యనునది సమాసముగా కాక వ్యస్తపదములుగా గ్రహించినచో దోష ముండదనుకొందును.

  1. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటము 54, సంచికలు 1, 2, విశ్వావసు చైత్ర-ఆషాఢములు, కాకినాడ.
  2. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, శృంగార శ్రీనాథము - 1923.
  3. శ్రీనాథ కవితాసమీక్ష ప్రథమసంపుటము, కాకినాడ - 1960.
  4. ఆంధ్రకవితరంగిణి, ఐదవ సంపుటము, పుటలు 25-31.
  5. శివరాత్రిమాహాత్మ్యము - పూర్వముద్రణ పీఠికలు.
  6. శృంగార శ్రీనాథము, పుట - 276.
  7. రెడ్డి సంచిక, పుట - 301.
  8. ఆంధ్రకవితరంగిణి - ఐదవసంపుటము.
  9. “శ్రీనాథుని రచనలు-పూర్వాపరాలు”, సాహితి, సంపుటము 5, సంచికలు 4, 5. జులై-ఆగస్టు, 1966. (ఏలూరు)