పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

“మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీంద్రుండు త-
న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా-
మహులై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమునఁ దత్ప్రాగల్భ్య మూహించెదన్”

-రామరాజభూషణుడు

కవిసార్వభౌముడైన శ్రీనాథుడు పుంభావసరస్వతి. ఆంధ్ర గీర్వాణ భాషలు ఆతని కన్నుసన్నల మెలగినవి. ఆతడు బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సమస్త శ్రుతి స్మృతి పురాణ శాస్త్రముల నాపోశనము పట్టినవాడు. సంస్కృత వాఙ్మయభాండాగారమును కొల్లగొట్టి ఆంధ్రవాఙ్మయమునకు పుష్టిని తుష్టిని కూర్చినవాడు.

“సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య | భాషాపరిజ్ఞానపాటవంబు
పన్నగపతిసార్వభౌమభాషిత మహా- | భాష్యవిద్యాసమభ్యాసబలము
నక్షపాద కణాద పక్షిలోదీరిత | న్యాయకళాకౌశలాతిశయము
శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత | కబళన వ్యుత్పత్తిగౌరవంబు
పూర్వకవిముఖ్య విరచితాపూర్వకావ్య- | భావరస సుధాచర్వణప్రౌఢతయును”

కలవాడని దగ్గుపల్లి దుగ్గన కొనియాడినాడు. అతివేలములైన ప్రతిభాపాండిత్యములు కలవాడగుటచే బ్రతికినన్నాళ్ళు వాఙ్మయరంగమున తన కెదురొడ్డువారు లేక దేశదేశములు తిరిగినాడు. ఉన్నతమైన పదవు లలంకరించినాడు. సమస్తవైభవము లనుభవించినాడు. అటు కర్ణాటమునకు పోయి ప్రౌఢదేవరాయల ఆస్థానమున ఉద్దండపండితుడైన డిండిమకవిసార్వభౌము నోడించి కనకాభిషేకగౌరవ మందినాడు. ఇటు రాచకొండ కేగి సర్వజ్ఞసింగభూపాలుని మెప్పించి తన యేలిక కోరిక తీర్చి మనసు కెక్కినాడు. ఇక కొండవీటి రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి యాస్థానమున దాదాపు రెండు దశాబ్దములు విద్యాధికారిగా నుండి ఆతడు నెరపిన యధికారము వర్ణింపరానిది.

శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు గొప్ప కవియట. భీమాంబా మారయామాత్యు లీతని గన్న ధన్యులు. పాకనాటిలోని కాల్పట్టణ మీతని జన్మస్థలము. శ్రీనాథుని దేశకాలముల గూర్చి పెద్దరగడ జరిగినది. వీరేశలింగంపంతులుగారు మొదలుకొని ఆరుద్రగారి వరకున్న సాహిత్య చరిత్రకారు లందరును శ్రీనాథుని దేశకాలములు, ఆతని జీవితవిశేషములు, ఆతడు సృష్టించిన వాఙ్మయమునుగూర్చి విపులముగా చర్చించియున్నారు. వాని నన్నింటి నిట ప్రస్తావింప నక్కరలేదు. పదునాల్గవ శతాబ్దము నాల్గవపాదము, పదునేనవ శతాబ్దము పూర్వార్ధ మాతని వాక్కు ఆంధ్రదేశ మంతటను మేఘగంభీరనాదముతో ప్రతిధ్వనించినదని తెలిసికొనుట చాలును.

మహాశివభక్తుడైన శ్రీనాథుడు తన రచనముల నన్నింటిని శివభక్తులకే కృతినిచ్చుట విశేషము. చతుర్విధ పురుషార్థముల నాతడు చూరగొన్నాడు. విధివశమున జీవితసంధ్యాసమయమున దైన్య మనుభవించినాడు. ఆతని నాదరించి పోషించిన మహాసామ్రాజ్యములే కూలిపోయినప్పు డొకవ్యక్తికి కలిగిన దైన్యము చెప్పుకొన నక్కరలేదు. ఆతని పండించిన కీర్తి రెడ్డిరాజులకు, ఆతని దండించిన యపకీర్తి యొడ్డెరాజులకు శాశ్వతముగా దక్కిపోయినవి. ఆత డెక్కి తిరిగిన పల్లకీ మోసిన బోయల ఓంకారనాదము, ఆరగించిన రుచులు, అలదుకొనిన కస్తూరీచందనములు, సేవించిన తాంబూలము పచ్చకప్పురపు గమగమలు, ధరించిన తారహారముల ధగధగలు, కర్ణకుండలముల వజ్రాల తళతళలు ఈనాటికిని ఆతని సాహిత్యమున మన కనుభూత మగుచున్నవి.

శ్రీనాథ సాహిత్యమునుగూర్చి సాహిత్యచరిత్రలందే కాక ప్రత్యేకగ్రంథములందును వివిధ వ్యాసములందును కాననగును. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి (శృంగార శ్రీనాథము), శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రి (శ్రీనాథుని కవితా సామ్రాజ్యము), శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి (శ్రీనాథకవితా సమీక్ష), ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు (శ్రీనాథ భారతము), శ్రీ కుందూరి ఈశ్వరదత్తు (శ్రీనాథుని కవిత్వతత్త్వము) వంటివారు ప్రత్యేక గ్రంథములే వ్రాసినారు. శ్రీ శ్రీహరిగారు, శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తిగారు సిద్ధాంత రచనలు చేసి Ph.D. పట్టము లందుకొన్నారు. శ్రీ బండారు తమ్మయ్యగారు, శ్రీ నిడుదవోలు వేంకటరావుగారివంటి పెద్దలెందరో యమూల్యవ్యాసములు ప్రకటించినారు.

కృతులు