పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

విడువరో [1]యెందేని విహరింపఁ జనుఁగాని
          కరవాఁడి ముక్కుల కాకిపిండు
ఖండింపరో వంటకాష్ఠంబులకుఁ గాఁగ
          నసిపత్రములతోడి [2]యవనిజములఁ
దోలింపరో వజ్రతుండకీటంబులఁ
          బ్రాకారపరిఖాంబుపార్శ్వములకు
నార్పరో ఘటసహస్రాంబుపూరంబులఁ
          బ్రబలకుంభీపాకపావకములు


గీ.

శాఠ్యముననైనఁ బరిహాససరణినైన
శంభునైనను హరినైన సంస్మరించి
పాపు లేఁగుచునున్నారు పరమగతికి
నారకము (వీడి) యీ యధికారమేల.

8


వ.

అని యాక్షణంబ చిత్రగుప్తాదులతోడం గూడి యముండు విరూపాక్షసందర్శనార్థంబు శివలోకంబున కరుగువాఁడు త్రయోవింశతిసంఖ్యాకంబులైన స్వర్గలోకంబు(లు) గడచి సప్తర్షిమండలంబు లంఘించి మహర్లోకంబు దాఁటి సత్యలోకం బతిక్రమించి సర్వలోకోత్తమోత్తమంబును ద్వాత్రింశత్కోటియోజనవిస్తారంబును జాంబూనదవిమానసహస్రసంకులంబును బహ్వాశ్చర్యధుర్యంబునునగు మహాస్థానంబు ప్రవేశించి బహుయోజనవిస్తీర్ణంబులును నానాద్వారసమంచితంబులును మణితోరణసంయుక్తంబులును హేమరత్నవితర్దికోటిశోభితంబులు దివ్యరత్నవిమానాఢ్యంబులు దివ్యపతాకాచ్ఛత్రవిచిత్రంబులు శాతకుంభస్ఫటికరత్నస్తంభసంభరితంబులు మహాకాళ భృంగిరిటి కుంభకుంభోదర ప్రముఖ ప్రమథగణాకీర్ణంబులు ననంతాశ్చర్యయుక్తంబులునగు దివ్యకక్ష్యాంతరంబులు దఱిసి పూర్వద్వారంబున.

9


క.

[3]సుయశోధీధనకాంతా-
దయితుని భసితత్రిపుండ్రధవళలలాటున్
నయనాభిరామమూర్తిన్
నియతాత్ముని నందికేశునిఁ బొడఁ గనియెన్.

10


వ.

కాంచి దండప్రణామంబు చేసి శైలాది కిట్లని విన్నవించె.

11


సీ.

దర్శింపవచ్చితిఁ దరుణేందుశేఖరు
          నఖిలలోకాధీశు నమరవంద్యు
కార్యంబు లెన్నేని గలవు విన్నపము సే-
          యంగ (నే) నధికారి నౌదుఁగానొ
[4]నీ శరణ్యుండనై నీవు ప్రతిష్ఠింప
          ననఘ యున్నాఁడ ధర్మాసనమున
భృత్యభూతుఁడ నీకు సత్యంబ పల్కెద
          నిన్ను దప్పంగ నే[5]నెన్న నొరుల


గీ.

ననుచుఁ బ్రియమాడు యమరాజు నాదరించి
నంది శంభుని [6]సన్నిధానమున కేఁగి

  1. తా. యందేని
  2. తా. యవని జలము
  3. తా. సుయశోభీధనకాంతా
  4. తా. నిశరవాండనై
  5. తా. నెఱుఁగ
  6. తా. సన్నిధానముకు నేఁగి