పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వేమహాదేవికలరు నయ్యిగురుఁబోఁడి, గమలజునితల్లి నతజనకల్పవల్లి
యిందిరాసుందరాంగి మన్మందిరమున, నిండువేడుక ననిశంబు నిలుచుఁ గాత.

5


ఉ.

ఫాలతలంబునందుఁ గరపద్మయుగంబు ఘటించి మ్రొక్కెదం
బాలితసిద్ధకిన్నరనభశ్చరమౌనిసురాళికి న్దయా
శాలికి భారతీవదనసారసబాలమయూఖమాలికిన్
క్షాళితదోషపాళికి జగన్నుతిశీలికిఁ దమ్మిచూలికిన్.

6


సీ.

చంపకోత్పలమహాస్రగ్ధర సుస్వరమణిమాలికానర్గగుణమనోజ్ఞ
మత్తకోకిలవాణి మానితవిచికిలస్తబకవర్ణవిభాగతరలహార
సరసేందువదన బంధురకాంతిసంయుక్త సరసిజనయన సుందరవరాంగి
నిత్యవిభూతిమానిని రుచిరోత్సాహ ప్రాద్యభేదాఖండపరమశక్తి


తే.

యతినుతశ్లోకఛందోమయప్రకాశ, యసమభజినరతగణామితానుమోద
యైనవాగ్దేవి నాదుజిహ్వాగ్రమునను, నిలిచి సత్కావ్యగుంభన నెఱపుఁగాత.

7


చ.

అనుదినమున్ మదిం జలన మానక మానక పూని దీనులన్
మనుచుచుఁ గార్యవేళల నుమాధవమాధవముఖ్యు లౌసురల్
దను వినుతింప మేలిడుచుఁ దానగు దానగుణాఢ్యుఁ డంచు నిం
పెనయఁగఁ గోరి మ్రొక్కిడుదు నేనిఁక నేనికమోముసామికిన్.

8


ఉ.

పాయనిభక్తితోడ మదిఁ ప్రస్తుతిసేసెద దీనరక్షణో
పాయుని యోగమార్గనిరపాయుని సంతతిరామకార్యధౌ
రేయుని దివ్యకాయుని వరిష్ఠవిధేయుని శిక్షితోగ్రదై
తేయుని నప్రమేయుని సుధీజనగేయుని నాంజనేయునిన్.

9


క.

వితతాగమశరణుండై, ప్రతిదినగూఢపదచరవిభాసితుఁడై ది
వ్యతరవిరాడ్విగ్రహుఁ డై, ధృతిఁ గేరు నజేయు వైనతేయున్ గొలుతున్.

10


క.

తవిలి నవప్రభ లెసగఁగ, భువి గేరడుమిత్రజాతబుధగురుభాస్వ
త్కవిమాహేయకలానిధి, కువలయచక్రారివంచకులఁ బ్రణుతింతున్.

11


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు బయ్యనామాత్యుఁ డేభవ్యుతాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగనమంత్రియును నరసన్నయు నేమంత్రి యనుఁగుఁదమ్ము
లలకఁ దిమ్మకవి రాజన్న జగ్గనయును సూరన యేధన్యు సుతవరేణ్యు


తే.

లొనర వీరమ్మ పాపమేఘనునిసహజ, లతిపతివ్రతలక్ష్మి యేచతురురాణి
యట్టి శ్రీకూచిమంచివంశాబ్దిచంద్రు, మజ్జనకు నలగంగనామాత్యుఁ దలఁతు.

12


క.

క్షితి నతిచతురతల ననా, రతనవిజనహితము లైనరామాయణభా
రతము లొనర్చినజగద, ప్రతిముల వాల్మీకిశక్తిపౌత్రుల నెంతున్.

13