పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఎన్నఁ డావెన్నుఁ డాదరం బెసఁగఁ జూచు, నెన్నఁ డీరుక్మిపంతంబులెల్ల నడఁగు
ఖిన్నుఁడై చేదిజగతీశుఁ డెన్నఁ డుఱుకు, నిష్టభోగానుభవసిద్ధి యెన్నఁ డొదవు.

74


వ.

అని పలికి కలికి తనమనంబున.

75


ఉ.

చిక్కనిగుబ్బచన్ను లెదఁ జేర్చి కవుంగిట బిగ్గఁ గూర్చి లేఁ
జెక్కుల ము ద్దొసంగి తమిచేఁ గళలంటినఁ బొంగి నెమ్మదిన్
జొక్కి సుధాధరంబు చవి చూపి గళధ్వను లుప్పతిల్లఁ బె
న్మక్కువ నవ్విభుం గలసి మారునికేలిఁ జెలంగు టెన్నఁడో.

76


క.

ఎగ్గించుక నే నతనిన్, సిగ్గున డగ్గఱకయున్నఁ జెలువుఁడు తమిచే
దిగ్గునఁ గైకొని కౌఁగిట, బిగ్గరఁ గదియించి రతులఁ బెనఁచుట యెపుడో.

77


ఉ.

నిచ్చలు విచ్చల న్విడిని నిద్దపుటద్దపుగుంపుసొంపుగా
గ్రుచ్చినపచ్చమానికపుగోడలనీడలు గాంచి యిచ్చటన్
నుచ్చుచు నచ్చముత్తియపుమేడల గొజ్జఁగిపువ్వుసెజ్జపై
మచ్చిక నచ్యుతుం గదిసి మన్మథలీలలఁ గేరు టెన్నఁడో.

78


క.

అకటా శకటాసురహరుఁ, డొకటం బ్రకటానురాగ మొదవఁగఁ గారు
ణ్యకటాక్షంబునఁ గోరిక, వికటము గావింప కెపుడు వీక్షించునొకో.

79


తే.

అనుచు మోహాతిరేకంబు పెనఁగొనంగ, నాత్మలోపల నూహించి యన్న సేయు
పనికిఁ గ్రేధించి మఱియు నిబ్బరపుటార్తి, మానసమునందు నంటి యామచ్చెకంటి.

80


ఉ.

కట్టదు పట్టుపుట్టములు కాంచదు కాంచనకాంచికాదులన్
బెట్టదు కొప్పు విప్పుగను బెంచదు కొంచెపుటంచబోదలన్
ముట్టదు వీణెపాణులను ముద్దుఁజెలుల్ దరిఁ జేరఁ గేరి చే
పట్టదు పట్టెడన్న మొకపట్టున నైన భుజింప దింపునన్.

81


క.

పాడదు మృదుగానము తమి, నాడదు నెచ్చెలులఁ గూడి యార్తులఁ గృపతోఁ
జూడదు హృదయాంతరమున, వీడదు చింతాభరంబు వెలఁదుక యెపుడున్.

82


ఆ.

కురులు తురుముదిద్ది విరులు నింపదు కుచ, గిరుల నురులుగొన్నసరులు విప్ప
దలర జలకమాడ దద్దంబుఁ గన్గొని, తిలక మిడదు నిటలఫలకమునను.

83


తే.

పసను బొంగారుబంగారుపళ్లెరమున, రసిరసాన్నంబు లిడి దాది ర మ్మటన్న
మసలుచును జేరి యుసురని బిసరుహాక్షి, కసరి కసిగాటులుగ వెస మెసఁగి లేచు.

84


ఉ.

చెంతలఁ జేరి యూడిగపుఁజేడియ లాకుమణుంగు లిచ్చినం
గాంత పరాకు మీఱ నవి గైకొని వేనలి నుంచు మంచిసే
మంతు లొసంగినం గుసుమమంజులగాత్రి విడెంబు సేయు నిం
కెంతని తెల్ప శక్యము నవేందునిభాస్యమనోవికారముల్.

85