పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అరుదెంచును రే పవ్విభుఁ, డరుదెంచినఁ గాంచి మోదమందెదవు సుమీ
హరి కరులఁ దఱుముకరణియె, హరి కరులం దఱుము టెల్ల హరిణాంకముఖీ.

64


ఉ.

మానిని యేవిచారమును మాని నిరంతరకౌతుకంబులో
నాని జెలంగుదుండుము జనార్దనుఁ డానరనాథయూధమున్
భూనుతవిక్రమం బలరఁ బోవఁగఁ దోలి నినున్ వరించు నం
చానలినాక్షికిం దెలిపి యానతిఁ గైకొని సాదరంగబుగన్.

65


తే.

రామకార్యంబు మదిఁ బూని రభసవృత్తి, దనర నరిగినయామరుత్తనయుపోల్కి
రామకార్యంబు మదిఁ బూని రభసవృత్తి, దనర నరిగెను భూమరుత్తనయుఁ డంత.

66


క.

మనుజాధిపసుత యివ్విధ, మున దామోదరునిఁ బిల్వ భూసురవర్యుం
బనిచియును నమ్మఁజాలక, ఘనతరచింతాభరంబు గడలుకొనంగన్.

67


క.

యెద దిగులు గదిరి మిగులన్, వదనాంభోరుహము వంచి వదలనికోర్కుల్
గుదిగొన నునుఁజెక్కునఁ గే, ల్గయించి విరించి నెంచి కళవళ మొదవన్.

68


వే.

కనుఁగొనలవల్ల వెడలెడుకజ్జలంబు, కలుము లొయ్యన లేఁజెక్కుఁగవకు జాఱ
వేఁడినిట్టూర్యుఁ దెమ్మెరల్ వృద్ధిమీఱ, నుసురసురటంచుఁ గృశియించుచున్నఁ జూచి.

70


ఉ.

కంపిలిగుంపులై చెలిమికత్తియ లత్తఱి బిత్తరిన్ విమ
ర్శింపను గార్య మెద్దియును జేయఁగనేరక చెంగటం బ్రవ
ర్తింపఁగఁ గొంతసేపునకుఁ దెల్వి వహించి నృపాలపుత్రి బ
ల్గెంపుమెఱుంగువాతెర చలింపఁగ వారలతోడ నిట్లనున్.

71


సీ.

చెలులార భూసురశ్రేష్ఠుఁ డాద్వారక కేరీతి నురవడిఁ జేరఁగలఁడు
చేరి యన్యులు ప్రవేశింపఁ జెల్లని రాజశుద్ధాంత మేలీలఁ జొరఁగఁగలఁడు
చొచ్చి యచ్చట దివ్యశోభానిరూఢిఁ గ్రీడించునచ్యుతు నెట్లు కాంచఁగలఁడు
కాంచి వంచనలేక గమలనాభునకు నాతెఱఁగెల్ల నెబ్భంగిఁ దెలుపఁగలఁడు


తే.

తెలుపఁగా విని విభుఁడు మదిం జెలంగి, యెవ్విధంబున న న్వరియింపఁగోరుఁ
గోరి యేక్రియ నెగ్గించుకొనక వచ్చు, వచ్చి యేగతి నిమ్మహీవరులఁ గెలుచు.

71


చ.

గెలుచుట దుస్తరంబు పరికింపఁగ నంబుజసూతి యీగతిం
జలము వహించె నించుకయు శాంకరికిం గృపఁ గల్గదయ్యె ని
మ్ముల నొనరించుదేవగురుపూజలు నిర్మలదానధర్మముల్
ఫల మిడఁజాలవయ్యె మదిఁ బాయదు కూర్మి యిఁకేమి సేయుదున్.

72


శా.

రాజీవేక్షణుఁ డేపుతో నిచటికిన్ రాకున్న గర్వాంధుఁడై
రాజశ్రేణులఁ గూడి చేదిపతి సంరంభంబుతోఁ జేరి వి
భ్రాజల్లీలల న న్వరించినపుడే పంతంబు చేకూరి యీ
వ్యాజస్వాంతుఁడు రుక్మి యుబ్బుఁగద రే యత్యంతసంతుష్టుఁ డై.

73