పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వినయవిహీనుం డగుచును, దనయానతి మీఱి తిరుగుతనయానుమతిం
బని యొనరింపఁగ దొరఁకొనె, జనకుండును వేఁదు రగుచుఁ జంచలబుద్ధిన్.

32


చ.

చెఱకున బండు లుద్భవము సేయక బుద్ధివిహీనుఁ డై ఫలో
త్కరము ముసిండిచెట్టునకుఁ గల్గగఁజేయుచు నున్నకైవడిన్
హరహర పాపజాతివిధి యావనమాలికిఁ గూర్ప నొల్ల కీ
పరమనికృష్టుఁ డైనశిశుపాలున కేక్రియఁ గూర్పఁ జూచెనో.

33


చ.

సరసగుణాభిపూర్ణుఁ డగుశౌరిపదాంబుజసేవ సేయఁగా
మరిమరి గోరుచిత్త మిఁక మక్కున నన్యులఁ జేరఁగోరునే
నిరతశుభాకరామరధునీపృథువీరవిరాజచూర్మికా
పరిచితరాజహంస మొకపట్టున పచ్చికపట్టుఁ జేరునే.

34


క.

హైమవతి కిపుడు నాపై, ప్రేమ మదిం గలిగెనేని వెస నొనఁగూడున్
దామోదరసాంగత్యము, దామోదరసాభ్యుదయనిధానం బగుచున్.

35


సీ.

కృష్ణమేఘ మురోజగిరిశృంగములమీఁద మెఱపు దీపింపఁగా మెలఁగు టెపుడు
మెలఁగి గంభీరవాగ్విలసితనిర్ఘోషములచేతఁ బలుమాఱుఁ జెలఁగు టెపుడు
చెలఁగి కృపారసోజ్జ్వలజలధారలు మరిమరి దఱచుగాఁ గురియు టెపుడు
కురిసి మనఃక్షేత్రగురుతరతాపాగ్ని యుడుగ నిర్భరలీలఁ దడుపు టెపుడు


తే.

తడిసి సంతతసౌఖ్యప్రదంబు లగుచు, మెండుకొని కామసస్యముల్ పండు టెపుడు
నిపుణమతి నూహ యొనరింప నపుడు గాక, తొలఁగునే దైన్యమతియెల్ల దూర మగుచు.

36


ఉ.

మారునిఁ గేరుచారుసుకుమారుని నందకుమారుని న్మనో
హారుని మౌనిమానసవిహారుని సన్మణిహారునిన్ రమా
ధారుని ఘోరశాత్రవవిదారుని శశ్వదుదారునిన్ సదా
చారుని భక్తరక్షణవిచారుని నేక్రియఁ జూడఁగల్గునో.

37


ఉ.

ఎవ్వరి వేఁడుకొందు మది నెంతని మోహము నిల్పుకొందు నిం
కెవ్వరు పంకజాయతదళేక్షణుఁ దోడ్కొని తెచ్చి యాత్మలో
నెవ్వగ మాన్పఁ జాలుదురు నీలబలాహకవర్ణుఁ డెప్డు తా
నివ్వసుధేశ్వరాధముల నెల్ల జయించి వరించు నన్ గృపన్.

38


సీ.

వికసితవిశదారవిందబృందంబులు గిరిరాజసుత కొసంగినఫలంబు
కలితప్రభాపూరకర్పూరపారతుల్ శివవధూమణికి నిచ్చినఫలంబు
మధురతామోదితమధురసంబుల జగజ్జనని కర్పణ మొనర్చినఫలంబు
కమనీయకల్హారసుమదామములు చండికకుఁ గూర్చి యిడిననిక్కపుఫలంబు


తే.

కొదవఁ బొదవక యిపు డొనఁగూడెనేని, నందనందనుఁ డతులితానందుఁ డగుచు
ననుఁ గృపాదృష్టి వీక్షించి నగుచు మధుర, భాషణంబులచేఁ గరస్పర్శ సేయు.

39