పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అందమై శుభవిభామందమై వృతసుధీబృందమై లోచనానంద మగుచు
సారమై భూరివిస్తారమై మరకతద్వారమై యాచకాధార మగుచుఁ
బూతమై భువనవిఖ్యాతమై సజ్జనోపేతమై మధురసంగీత మగుచుఁ
దివ్యమై బహుతరద్రవ్యమై సతతసంభావ్యమై సుభటసంసేవ్య మగుచు


తే.

శుంభిదంభోజరాగవిష్కంధశాత, కుంభజృంభితవిద్రుమస్తంభవితతి
జంభజిన్మణిగుంభితాదంభజాల, జాలకం బైనయొకసభాస్థలమునందు.

106


క.

నిండుఁగొలు వుండ దయ నధి, కుండన రూపాబ్జసాయకుండన సుగుణాం
కుండన నిశ్శంకుండనఁ, గుండినవిభుఁ డైనభీష్మకుం డినవిభుఁ డై.

107


క.

అతులగతి నిబ్లు కొలువై, హితులున్ బుధతతులు మతిమహితులున్ ధరణీ
పతులున్ ధృతిఁ గేరుపురో, హితులున్ సుతులు వినంగ నిట్లని పలికెన్.

108


చ.

తవిలి మదీయపుత్రి యగుతామరసాయతనేత్ర రుక్మిణిం
బ్రవిమలతేజుఁ డైననరపాలతనూజున కిచ్చి ధారుణీ
దివిజులు రాజులుం బొగడ దిక్కులఁ గీర్తి వెలుంగ భూరివై
భవమునఁ బెండ్లి సేయుటకు భావమునం దిపు డుత్సహించెదన్.

109


క.

కులమును రూపము విద్యయుఁ, దెలివియు జవ్వనము నీతి ధృతియున్ మతియుం
గలిమియు బలిమియుఁ జెలిమియుఁ, గలవరునకుఁ గన్య నొసఁగఁగావలె నెలమిన్.

110


క.

దానమ్ములలోఁ గన్యా, దానము ఘనపుణ్య మని బుధప్రకరము లిం
పూని వచింతురు గావున, మానవతతి కిది సుకర్మమార్గం బరయన్.

111


తే.

తగినవరునకుఁ గన్యకాదాన మొసఁగి, ప్రేమ నీరెడుతరముల పితరులకును
హర్ష మొనరించి యన్వయం బవిరళముగఁ, బావనము సేయు టుచితంబు ప్రాజ్ఞులకును.

112


క.

తద్దయు శుభకార్యంబులు, పెద్దలతో నూహ చేసి పిదపన్ వారల్
దిద్దినరీతి నొనర్చుట, నుద్దామం బైనభద్ర మొదవుచు నుండున్.

113


క.

హితకార్యం బతిసత్వర, గతిఁ జేయఁగవలయుఁ బూని ఘనులకు నెల్లన్
క్షితియం దనవద్యంబుగ, స్మృతు లెన్నుంగద శుభస్య శీఘ్ర మ్మనుచున్.

114


క.

కావున రుక్మిణికిం దగు, భూవర సుతు నాత్మ నరసి పొలుపొందఁగ మా
కావిధ మెఱిఁగింపుఁడు స, ద్భావంబున బుధులు హితులు బాంధవతతులున్.

115


చ.

అనుటయుఁ జారుకార్యగతి యారసి యారసికాగ్రగణ్యుఁ గ
న్గొని మనుజేశ నీతనయకుం దగురాజకుమారు మారుఁ బో
లినసుకుమారు ధీరు నవిలీనబలాహవశూరు మాకుఁ దోఁ
చినపగిదిన్ వచించెదము చిత్తమునం గలరీతిఁ జేయుమా.

116


చ.

గొన బగురూపభావితునిఁ గోరును గన్నియ వన్నెమీఱఁ ద
జ్జననిధనంబుఁ గోరు శ్రుతశాలిని గోరును దండ్రి చుట్టముల్