పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పువుఁబోణులకు జగత్పూజితాకారుఁ డౌపురుషుఁడు వెలలేనిభూషణంబు
అలివేణులకుఁ బూర్ణయౌవనుండై చెలంగెడుమనోహరుఁడు ముంగిటినిధాన


తే.

మబ్జముఖులకు బలవైభవానురాగ, నిరతుఁ డగునాయకుఁడు చేతినిమ్మపండు
ఇన్నిగుణములు శౌరియం దెన్నఁబడియె, నతఁడు విభుఁ డౌటకన్న భాగ్యంబు గలదె.

98


క.

సరసోదారధరాధర, ధరమధురాధరసుధాసుధారాసిక్త
స్ఫురదమలతరమృదూక్తులు, పరమానందమున వినెడుభాగ్యం బెపుడో.

99


సీ.

పీతాంబరాస్యేందుబింబ మీక్షింపక నయనోత్పలంబు లేక్రియఁ జెలంగు
హరికరాంబురుహవిస్ఫురణ లభింపక కచమధువ్రతిము లేకరణిఁ బొదలు
శౌరివక్షఃకషాశ్మమున రాయక కుచకనకకందుకము లేగతిని మెఱయు
దైత్యారివాగ్వృష్టిధారలు సోకక శ్రవణకూపంబు లేసరణి మబ్బుఁ


తే.

గృష్ణలావణ్యగంగాసరిత్తరంగ, మాలికాడోలికాకేలిఁ దేలి లీలఁ
దేజరిల్లక మానసరాజహంస, మేతెఱంగున సంతతప్రీతి నలరు.

100


ఉ.

విందుము ముందు వీనుఁగవ విందుగఁ బొందుగనందు మంద నా
నందము నందమున్ మెఱయ నన్యవిలాసకళాసమగ్రుఁ డై
సుందరమందహాసరుచి శోభిల వ్రేతలఁ గూడి యాడుగో
విందునిఁ జెంద మున్ జెలులు వేమఱు నేమివ్రతంబు నోఁచిరో.

101


సీ.

తనశిరంబున శౌరి తలఁబాలు వోసిన మానికంబులు శంభుమాళి నునుతుఁ
జెలఁగి కృష్ణుఁడు నన్నుఁ జెట్టవట్టిన నుమాధవునకుఁ గేలెత్తి దండ మిడుదు
హరి తనమృదులపదాగ్రంబుఁ ద్రొక్కిన ఫణిహారునకుఁ బ్రదక్షిణ మొనర్తుఁ
ఋరుషోత్తముఁడు దనపొత్తునఁ గుడిచిన హరునకు నమృతోపహార మిడుదుఁ


తే.

జక్రి దనుఁగూడి మంగళస్నాన మెలమి, నాచరించినఁ బురనిశాటాహితునకుఁ
దనర నభిషేక మొనరింతు ననుచుఁ బెనుచు, పరిణయోత్సాహమునఁ బల్కుఁ బంకజాక్షి.

102


చ.

చెలులకు నిత్తెఱం గెఱుఁగఁ జెప్పినయప్పుడె గేలి సేయఁగాఁ
దలఁతురుగాని రాజునెడఁ దప్పక యిప్పని యొప్పుమీఱఁగాఁ
దెలుపుడుచేసి యొయ్యన మదీయమనోరథసిద్ధిగా శుభం
బెలమిని సంఘటింపఁగలరే చెలరేఁగి కృతోపకారలై.

103


క.

అని యిత్తెఱఁగున హరిపైఁ, దనరఁగఁ జిత్తంబు నిల్సి తనలోఁ దానే
యనవరతముఁ జింతించుచు, వనజేక్షణ పరమయోగివైఖరిఁ జెలఁగెన్.

104


ఉ.

ఆయెడ నొక్కనాఁడు సచివాప్తపురోహితరాహుతావనీ
నాయకగేయకార్యరతనాటకచేటకచాటుకావ్యసం
ధాయకగాయకార్యసముదాయకళాకుశలారిభేదనో
పాయవిదుల్ భజింప నిరపాయనృపాయతవైభవంబునన్.

105