పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

భారతదేశమున


పరచుటకు ఎట్టి ఆటంకములు లేవనియు శాసింపబడినది. ఈ అవకాశమును పురస్కరించుకొని ఇంగ్లాండు ప్రారంభించిన ఏ సామ్రాజ్యయుద్దవ్యయములుగాని మనపైన రుద్దుటకు వీలుకలదు. ఈ ఉద్యోగములందు భారతీయులు నియమింపబడుటను గూర్చిన తలంపు సైతము ఈప్రకరణమున గానరాదు. భారతీయుల చేతులందుగాక పరాయివారి అధికారముక్రింద పనిచేయుచు ఇంగ్లీషువర్తకుని ధనార్జనకు మంచి రక్షణ గలుగజేయు ఈ సైన్యభారము మనపైన వేయబడినది.

ఐ. సి. ఎస్. వగైరా ఉద్యోగులు :

భారతదేశమునకు ఉక్కు చట్రముగా పనిచేసిన ఇండియన్ సివిల్ సర్విసులోను, ఇండియను మెడికల్ సర్విసులోను ఇండియన్ పోలీసు సర్వీసులోను, ఉద్యోగులను నియమించు అధికారము 244 వ శెక్షనుప్రకారము ఇంగ్లాండులోని రాజ్యాంగకార్యదర్శి కివ్వబడినది. ప్రజామోదమును పొందు మంత్రులు, ఈమంత్రులకే యజమానులుగా నుండు సేవకులునుగల విపరీతపువిధాన మెప్పటివలెనే యుండును. మన ఉద్యోగవర్గమునందు బ్రిటీషువారు ఇప్పుడు చలాయించుచున్న అనేకపదవులను, అత్యంత సమర్థతతోను గౌరవముతోను నిర్వహింపగల భారతీయులనేకు లున్నప్పటికిని బ్రిటిషువారినే ఉద్యోగములందు నిలుపుటకు తోడ్పడునట్టి యీపద్ధతి చాలా అన్యాయముగా నున్నది. రాజ్యాంగకార్యదర్శి సాధారణముగా ఇంగ్లీషువారినే నియమించును. ఇంగ్లీషువారితో పోటీ