పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పద్మపురాణము


వ.

జయవిజయనామంబులం గలిగి విష్ణునకుం బరమాప్తులై ద్వారం
బున ననవరతంబును గొల్చియుండ నొక్కనాడు బ్రహ్మపుత్రు
లును యోగీశ్వరులును విష్ణుభక్తిపరాయణులు నగు సనక
సనందనాదిమునిముఖ్యులు విష్ణుదర్శనలాలసులై చనుదెంచునప్పు
డంతఃపురంబునఁ గమలాలయసమేతుండై విష్ణుఁడు విశ్రమించు
టం జేసి యమ్మనుల నవసరంబు గాదని వారించిన వార లతి
రోషాయత్తచిత్తులై వారి నిద్దఱం గనలి చూచి యిట్లనిరి.

6


ఉ.

శ్రీ విభుఁ జూచువేడ్క నిటఁ జెచ్చెర వచ్చిన మమ్ము నిమ్ములం
బోవఁగనీక యడ్డపడి పొండని త్రోచినపాపు లిద్దఱున్
భూవలయంబునం దనుజపుంగవులై జనియింపుఁడంచు దుః
ఖావహమైన [1]శాపము రయంబున నిచ్చిరి నొచ్చియ్మునుల్.

7


వ.

ఇ ట్లతిదారుణంబైన మహాశాపం బిచ్చిన వారలు వడవడ వణుంకుచు
బాష్పజలపూరితనేత్రులై తచనుదెంచి ముకుందునకు సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి లేచి నిలిచి కృతాంజలులై గద్గద
కంఠులగుచు మునులశాపప్రకారంబు చెప్పిన నద్దేవుండు కరు
ణించి వారల కిట్లనియె.

8


ఉ.

అప్రతిమానతేజులు గుణాఢ్యులు నిత్యులు పుణ్యమూర్తు లా
విప్రులు సర్వదిక్కులఁ బవిత్రులు వారల నడ్డపెట్టి మీ
రప్రియ మాచరించి రహంకరణంబున వారిమాటకున్
నిప్రతిపత్తి పుట్ట దది వేదము దప్పినఁ దప్పనేర్చునే.

9


వ.

అట్లు గావున మీరు భూలోకంబున జనియించి యేడుజన్మంబుల
మద్భక్తులై యొండె మూడుజన్మంబుల విరోధులై యొండె నన్నుఁ
గూడంగలవా రనిన విని వాసుదేవునకు జయవిజయు లిట్లనిరి.

10
  1. శాపమనంబును నిచ్చిరి (ము)