పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

257


వ.

మఱియుఁ ద్రయోదశియందు నర్కోదయంబునం గళామాత్రం
బైనను ద్వాదశి గలిగెనేని హరిసమారాధనంబు చేసి పారణసేయ
వలయు మఱియు ద్వాదశియందు సూర్యోదయంబునం గళా
మాత్రంబైన నేకాదశి గల్గెనేని [1]శుద్ధంబైన యేకాదశి విడిచి యం
దుపవసింపవలయు. ని వ్విధంబున నిశ్చయించి హరిదినంబు
దప్పక యుపవసింపవలయు. దశమీద్వాదశుల రాత్రుల నేకాదశిని
సాయంప్రాతఃకాలముల నన్నంబు వర్జింపవలయు. దశమియం
దేకభుక్తంబుండి స్త్రీసంగమంబును మాంససేవనంబును వర్జించి
భూశయానుండై యేకాదశి నుపవసించి ధాత్రీఫలాలేపితాంగుండై
పుణ్యజలావగాహనం బొనర్చి యారాత్రి నియతాత్ముండై షోడ
శోపచారంబుల విష్ణుసమారాధనంబు చేసి పతితపాషండపరాఙ్ము
ఖుండై [2]జాగరణంబు చేసి తత్ప్రభాతంబున.

149


క.

తులసీసమ్మిశ్రితమగు
జలమున మజ్జనము చేసి సమ్యగ్విధి ని
శ్చలమతితోఁ బితృతర్పణ
ములు సేసియుఁ బిదప హరినిఁ బూజింపఁ దగున్.

150


వ.

ఇట్లు లక్ష్మీసమేతుండైన జనార్దనుం గర్పూరసుగంధంబులను
దులసీపత్రంబులను పరిమళకుసుమంబులను శతపత్రంబులను
నర్చించి ధూపదీపనైవేద్యతాంబూలంబులు సమర్పించి ప్రదక్షిణ
నమస్కారంబు లాచరించి శ్రీసూక్త పురుషసూక్త మంత్రంబులం
బాయసాజ్యాహుతుల నష్టోత్తరశతంబు వేల్చి బ్రాహ్మణభోజనం
బులు గావించి తాను మౌనియై పారణాచరణంబు చేసి పురాణాది
పఠనతత్పరుండై దివంబునందు నిద్రింపక యుండి యా రాత్రి
భూశయనంబున స్త్రీపరాజ్ముఖుండై యుండవలయు.

151
  1. శుద్దంబై యాద్వాదశి విడిచి (ము)
  2. హరిం దలంచుచు జాగరణంబు చేసి (హై)