పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

255


వ.

అనిన విని కూర్మవల్లభుండు బ్రహ్మాదిదేవతలకుం బ్రియంబుగా
సప్తద్వీపసాగరశైలాధిక యగు వసుంధరారమణిం దనవీఁపున
ననూనబలపరాక్రమసంపన్నుండై వహించె. బ్రహ్మాదిదేవసమూ
హంబును దమ తమ నిజస్థానంబులకుం జని సుఖంబుండిరి. అది
యాదిగా నఖిలజగంబులును మధుసూదనాజ్ఞాపురస్కృతులై
యేకాదశీదివసంబున జనార్దనుని నారాధించుచుందు రని లక్ష్మీ
జన్మంబును గూర్మరూపవైభవంబును నుపన్యసించి.

137


క.

కమలాలయజన్మంబును
గమఠాహ్వయుఁడైన విష్ణుకథనంబును ని
త్యము వినిన పుణ్యపురుషుల
కమితైశ్వర్యములు నొందు సమములు [1]పాయున్.

138

ఏకాదశీవ్రతమాహాత్మ్యము :

వ.

అని యానతిచ్చి శంకరుండు గిరిజం గనుంగొని యింకనేమి విన
వలయు నడుగు మనిన నమ్మహాదేవి యి ట్లనియె.

139


ఉ.

ద్వాదశియందుఁ గైకొను వ్రతంబు మహత్త్వము వాసుదేవు శ్రీ
పాద సమర్చనక్రమముఁ బ్రస్తుతికెక్కెఁ బునీతయైన యే
కాదశిఁ జేయుకృత్యమునఁ గల్గెడునట్టిఫలంబు లన్నియు
న్మోదముతోడఁ జెప్పుము సముత్సకమయ్యెడుఁ జిత్త మెంతయున్.

140


క.

అని యడిగిన గిరిజాతకు
ననియె మహాదేవుఁ డిప్పు డడిగిన యర్థం
బనుపమపుణ్యావహమును
వినుతశుభాన్వితము దీని విను మేర్పడఁగన్.

141


క.

ఏకాదశి నుపవాసము
ప్రాకటముగ నున్ననరులు భవబంధములన్
గైకొనక [2]నిత్యముక్తి న
నాకులమతి విష్ణుపదము నందుదు రబలా!

142
  1. పొలియున్ (మ-తి-హై)
  2. నిత్యులగుచు (హై)