పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

197

ఊర్ధ్వపుండ్రధారణ ప్రభావము :

ఆ.

పొలుపు మిగుల నూర్ధ్వపుండ్రమధ్యంబున
సిరియుఁ దానుగూడి హరి వసించి
యుండుఁ గాన శుద్ధుఁ డూర్ధ్వపుండ్రము దాల్చు
నాతఁ డతని గృహము నతిశుభంబు.

80


క.

నరుఁ డెవ్వఁడేని తెల్లని
తిరుమణి ధరియించు నతఁడు తీర్థము లెల్లం
బరువడి నాడిన ఫలమును
వరదీక్షల ఫలముఁ జెందు వనరుహనయనా!

81


క.

విను! మూర్ధ్వపుండ్రధారణ
మొనరించిన యట్టి భూసురోత్తముఁడు జగం
బునఁ నెల్లఁ బూజ్యుఁడై తుది
ననుపమసురయాన మెక్కి హరిపురి కరుగున్.

82


క.

తిరుమణి పెట్టిన సద్ద్విజ
వరు జూచిన నణఁగుఁ బాపవర్గంబెల్లం
గరమర్థిఁ జేరి మ్రొక్కినఁ
బరికింపఁగ సకలదానఫలములుఁ జెందున్.

83


ఆ.

ఊర్ధ్వపుండ్రధారణోత్తము నెవ్వఁ డేఁ
గోరి పైతృకమునఁ గుడువఁ బెట్టు
నతని పితరు లెల్ల నాకల్పశతములు
తృప్తులగుట నిజము తీవఁబోడి!

84


క.

నిట లోర్ధ్వపుండ్రమునఁ బ్ర
స్ఫుటుఁడై పైతృకముసేయు భూసురు పితరుల్
పటుగతి నేగుదురు సము
త్కటముగ గయఁ బిండమొందు [1]ధన్యుల గతికిన్.

85
  1. ధన్యుని గతికిన్ (ము)