పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

పద్మపురాణము


వ.

అయ్యవంతిదేశంబున భద్రకుండను నొక్కబ్రాహ్మణుండు నిజ
కులాచారంబులు విడిచి జననీజనకులం దొఱంగి యతికృపణుం
డును జంచలస్వభావుండును ధర్మదూరుండును దురాచారుండునై
తిరుగుచు నశనాభిలాషియై యొక్కనాఁడు తీర్థయాత్ర చనువార
లం గూడుకొని ప్రయాగకుం బోయి మాఘమాసంబున మూఁడు
దినంబు లవగాహనంబు చేసి యవగతపాపుండై సద్ద్విజత్వంబు
నొంది.

215


చ.

అతఁడుఁ బ్రయాగతీర్థ మటులాడి పురంబున కేగుదెంచెఁ ద
త్పతియగు వీరసేనుఁడును భద్రకుఁడున్ సమకాలమందు స
న్మతిమృతులై సమంచితవిమానము లెక్కి విభూషితాంగులై
యతులితరూపయౌవనబలాతిశయంబునఁ జూడఁ దుల్యులై.

216


వ.

మందారపుష్పమాలాలంకృతులును దివ్యభూషణభూషితులును
దివ్యాంబరధారులును దివ్యస్త్రీసహస్రపరివృతులునునై సురపతి
సమ్ముఖంబున నిరువురుం గొలిచియుండం జూచి వచ్చి తట్లు
గావున రాజసూయాశ్వమేధంబులును బ్రయాగస్నానంబును
సమంబులు.

217


ఆ.

అవని రాజసూయయాగంబు చేసిన
యతఁడు[1]నమరసౌఖ్య మనుభవించి
రాకపోకలేని లోకంబు నరుఁ డొందు
మహిఁ బ్రయాగ మాఘమజ్జనమున.

218


వ.

అట్లు గావునఁ బ్రయాగస్నానంబు చేసిరేని దన్మహత్త్వంబున
గంధరకన్యకలును నీపుత్త్రుండును పిశాచత్వంబు వలనం
బాయుదు రట్లగుటం జేసి బ్రహ్మతీర్థస్నానంబు సేయింపవలయు
నని చెప్పి రోమశుండు మఱియు నిట్లనియె.

219
  1. మరలు (ము)