పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

129


ఉ.

అక్కట ముద్దుకూన లిటు నాడఁగ నేటికి వచ్చి రిచ్చఁ; దా
రెక్కడి బ్రహ్మచారి నిట నేటికిఁ గన్గొని; రా దురాత్మకుం
డక్కటికంబు మాలి యిటులాఱడి నేల శపించె వీరలం;
ద్రెక్కొని యిట్లు చేసితె విధీ యని యేడ్చుచు నార్తమూర్తులై.

196


క.

ఆ విప్రవరుని జనకుం
డై వెలసిన వేదనిధి నిజాత్మజు వెదకం
గా వచ్చి ఘనపిశాచం
బై వికృతాకారుఁడై న యాతనిఁ గనియెన్.

197


వ.

ఇట్లు కనుంగొని యాతని వెనువెంటన యాక్రందనంబులు
సేయుచుఁ జనుదెంచు పిశాచికలగు వారలంజూచి యడలుచున్న
గంధర్వదంపతులం గనుంగొని యిది యేమి మీర లెవ్వ రిందులకు
రాఁ గతంబేమి యని యడిగిన వార లిట్లనిరి.

198


క.

మా పిన్నపాప లిచటికి
శ్రీ పార్వతి నోమ వచ్చి చెచ్చెర నొకదు
ర్వ్యాపారి [1]వడుగుఁ బొడగని
రా పొడువఁడు వారిఁజూచి యదయాత్మకుఁడై.

199


వ.

అక్కన్నియలకుం బిశాచరూపంబులుగా శపియించిన వారలు
నవ్వటుకుమారునిం బిశాచంబ వగుమని శపియించి; రిట్లన్యోన్య
శాపంబులం జేసి వికృతాకారులై పొత్తుల కర్మంబు లనుభవించు
చున్న యక్కన్నియలకు జననీజనకులమని చెప్పిన నవ్విప్రుండు
నతండు తన తనయుఁ డని చెప్పి హాహాకారం బెసంగ నేడ్చి,
ధైర్యం బవలంబించి విధికృతం బనుభవింపకపోవదని నిశ్చ
యించి యుండె; నివ్విధంబున నతిక్రూరంబులగు నవస్థ లనుభ
వించుచుండఁ బెద్దకాలంబు సనుటయు నచ్చోటికిఁ దీర్థస్నానార్థియై
రోమశమహామునీంద్రుండు పౌష్యశుద్ధచతుర్దశియందు వచ్చిన
నవ్విప్రు భక్షించు తలంపున నప్పిశాచంబులు చనుదెంచి.

200
  1. నిచట బొడగని, రావడుగయు (తి), రాపొడువయు (హై)