పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

పద్మపురాణము


వ.

అట్లు గావున నుత్తరంబు చెప్పక యనుగ్రహింపుమని సకలశాస్త్ర
సమ్మతంబుగాఁ బలికిన యక్కన్నియలం గనుంగొని విప్రుం డి
ట్లను మీ మాటలు సర్వధర్మంబులును సత్యంబులునై యున్న
యవి; యయిన నొక్కతెఱఁగు చెప్పెద వినుండు.

177


క.

దొరఁకొన్న వ్రతము నిండఁగ
గురుజనములచే ననుజ్ఞఁ గొనియే మిమ్ముం
బరిణయ మయ్యెద విడువుఁడు
తరుణులు మీ కింత చేయఁదగునే తలఁపన్.

178


ఆ.

అనిన నింతు లనిరి మునికుమారునిఁ జూచి
యేల వచ్చె నీకు బేలతనము
శీలసుభగలైన బాలిక లబ్బెడు
నింతకంటె వ్రతము లెవ్వి జగతి?

179


క.

ఏ మెక్కడ నీ వెక్కడ
కాముఁడు మము మరులు గొలుపఁగా నిబ్భంగిం
బ్రేమమునఁ దగిలి వచ్చిన
మామీఁదఁ గటాక్షదృష్టి మలఁచుట దగునే!

180


వ.

అని బహుప్రకారంబుల నొడంబఱచుచు మమ్ము గాంధర్వవివాహం
బునం బరిగ్రహింపు మనిన నతం డిట్లనియె.

181


క.

ధర్మాత్ములైనవారికి
ధర్మంబుఁ బరిత్యజింప ధర్మం బగునే
ధర్మార్థకామమోక్షము
లర్మిలిఁ గ్రమయుక్తి సలుప నధికఫలంబుల్.

182


క.

విపరీతమైన ధర్మము
గపటమతిం జేయ నంత కామాంధుఁడనే
యిపుడు మిముఁ బొందు వేడుక
నెపమెద్దియు నాకు లేదు నెలఁతుకలారా!

183