పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

క్రొత్తగా కల్పిస్తూ శబ్దకాఠిన్యం అన్వయక్లేశం లేకుండా పురాణశైలిలో అనువాదం చేసినాడు. "ఔచిత్యపోషణ కోసం చిన్నచిన్న మార్పులు చేసి మూలానికి మెరుగులు దిద్ది నైమిశారణ్యాన్ని నందనవనంగా మార్చినాడు."

పోతన భాగవతాన్ని-

చ.

లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణ మమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

-(I-20) అని వర్ణించినట్లే సింగన పద్మపురాణాన్ని ఒక పద్యంలో అమృతపయోధి (I-66) తోను, మరొకపద్యంలో తరువుతోను (I-66) పోల్చి మనోహరంగా వర్ణించినాడు.

పద్మపురాణంలో అక్కడక్కడ మూలాతిశాయి వర్ణనలు కూడ ఉన్నవి. దిలీపమహారాజు వేటాడి అలసి ఒకకొలను చెంత మాధ్యాహ్నికక్రియలు ముగించి విశ్రమిస్తుండగా సాయంకాలం ఐనది.

చ.

ఘనమగు నెండతాఁకునకుఁ గాయము కంది పరిభ్రమార్తుఁడై
జనపతి విశ్రమించె విలసన్మతిఁ జల్లనిరాజు గాన న
య్యనఘుఁ దపింపఁజేయ దగదంచుఁ దొలంగిన భంగి నర్కుఁ డొ
య్యనఁ జనియెన్ రథాంగకసమాఖ్యము లంగజుచేత బెగ్గిలన్.

(I-108)

ఇది మూలంలో లేదు. ఇందులోని 'చల్లని రాజు' దిలీపునికి చంద్రునికి వర్తిస్తుంది. చంద్రుడు సూర్యకిరణాల మూలంగానే ప్రకాశిస్తాడనేది వైజ్ఞానికసత్యం.

పురూరవునికి తైలసేవాదోషం శ్రీమహావిష్ణువు అపనయించినంతవరకే మూలంలో ఉండగా సింగన ఊర్వశీపురూరవులసమాగమం క్రొత్తగా కల్పించినాడు. ఈ సందర్భంలోని వర్ణనం ప్రబంధఫక్కిలో ఉన్నది.