Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఛవిమత్కాంచనమేఖలాలతిక దృష్టంబైన లాగించి నీ
వవిలంబంబునఁ బెట్టు మమ్మనికి రా జాపాముఁ జంపించెడిన్.


ఉ.

నావిని కాక మవ్విధమునం జరియించెదనంచుఁ బోయి రా
జావసధంబు జేరి యరయం బ్రతిసాధనఁ జేయఁబోవుచుం
బ్రావృతమేఖలాలత ఖురాళ్యుపకంఠముఁ జేర్చె దాని నా
లోవెస నంఘ్రులం గమిచి లోకులు సూడఁగ నభ్రగామియై.

330


చ.

అరుదు ఘటిల్ల మందగతి నంతట నింతట నాసపాటుగా
నరుగుచునుండ రాజపురుషావళి మ్రోయుచు రాజునానతిన్
గెరలుచు వెంటరాఁ దొలుతఁ గృష్ణభుజంగమ మున్నవృక్షకో
టరమున మేఖల న్విడిచి దాఁపున నొండొకమాన నుండినన్.

331


క.

పరశుప్రహారములఁ ద, త్తరుకోటర మగలవైచి తత్రత్యఫణిన్
మెరిగొని మేఖలయున్ గొని, పరిజనులుం జనిరి కాకిపగయును దీరెన్.

332


వ.

పరాక్రమంబునకంటె నుపాయం బెక్కువ యని చెప్పి వెండియుం దమనకుండు.

333


క.

ఇల బుద్ధిగలఁగునతనికి, బలముంగల దెట్టులనినఁ బటుబుద్ధిసము
జ్జ్వల మొకశశక మొకానొక, పొలమున మన్మత్తకరిరిపుం బొరిగొనదే.

334


క.

నావిని కరటకుఁ డది యె, ట్లీవిధ మెఱిఁగింపు మనిన నినసంసత్సం
భావితనయశాస్త్రకళా, కోవిదుఁ డాయనకు దమనకుం డిట్లనియెన్.

335


సీ.

దంతిదంతాగ్రనిర్దళితమస్తకగళన్నూత్నముక్తౌఘపాండూకృతంబు
బహుళతిర్యగ్దృషత్ప్రతిహతస్యదనదజ్ఞరఘనస్తనితలాస్యదమయూర
మచ్ఛభల్లప్రహారాస్థాతృమాక్షికచ్ఛత్రసంకీకృతక్ష్మాతలంబు
బిలసదాహారితుందిలసంకునిర్ముక్తసాంకవసురభితస్థాణుమూల


తే.

మాదృతాఖండవాగురికావతరిత, రజ్జురజ్యద్గరుచ్ఛటాభ్రాంతిచాయి
చమరవాలవిలోకసంచకితమృగము, గల దొకానొకగహన మక్కానలోన.

336


క.

కుక్షింభరి యగునొకహ, ర్యక్షము వర్తించు నహరహ మమర్యాదా
దక్షంబై నానామృగ, శిక్షాభక్షాప్తి నుల్లసిలు నది నెరయన్.

337


క.

ఈరీతి మేరమీఱి య, వారణవారణవిరోధి వధియింపంగా
బోరా దెరు వెఱుఁగక యా, ఘోరాటవి మృగములెల్ల గుములై భీతిన్.

338


వ.

వచ్చి యక్కేసరికిం బ్రణామంబు లాచరించి.

339


సీ.

గిరిదరీముఖబహుద్విరదశోణితసిక్తగండశైలము కనత్కనకపీఠి
పరితోవిసారి శంబరలులాయవ్యాఘ్రాహరణఘోషములు తూర్యారవములు