Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

దండినిప్పుల వసంతములాడు నెండల వడఁజల్లు పడమటివాయువులును
గ్రోవిగుంటలు దక్క గుల్లలు చిక్కంగ నివిరినగొంగరాయిడికి మిడికి
కొరదయుఁ గడిసె పాపరమల్గుముచ్చంగి కొంటెముక్కును లొంపిఁ గ్రుచ్చుకొనియె
వాలువముకుదమ్ము వల్లెగండెతనత్తె గుజ్జుబేడిసఱాతికొఱుకు మడిస


తే.

నూతయలజళ్ళ చెఱువుల నుండరాక, కార్మొసళ్లు నెగళ్లును గవులు విడిచి
తరలి చెంతల నూతిగుంతల వసించె,
[1]గెరలి వర్తిలు నమ్మహాగ్రీష్మమునను.

294


ఉ.

శంబరశోషణక్రియకుఁ జాలి దురంతతరప్రతాపరే
ఖం పథికాంగకంబులకు గాఁక ఘటించి హరింతు రంగసే
వ్యంబు మహాబలోద్ధతము నయినశతాంగము నెక్కి యన్నిదా
ఘంబునఁ బద్మినీయువతికాముఁడు కాముని దెల్పెఁ బొల్పుగన్.

295


వ.

మఱియు నవ్వేసవి శోషితసింధురాజంబయి ధనంజయుం గృశీకృతదశకంధరంబయి
దాశరథిని ఘనాఘననర్తితశిఖిమండలంబయి కంధరారంభంబును భోగివిరాజమానం
బయి బలిసదనంబు ననుకరించె మఱియును.

296


చ.

అనిమిషమండలీరుచికమయి కవిరాజవిరాజితోక్తుల
న్దనరి మరున్నికేతనమన న్గనుపట్టిన దాని నొక్కచోఁ
గనియె సరోవరంబు ఝషకంబులఁ బట్టుకొనంగ శక్తి లే
క నిలిచి క్రౌంచ మెచ్చిరులు కారియఁ దత్తటి నూరకుండఁగన్.

297


వ.

దాని నిరీక్షించి యొక్కకుళీరం బిట్లనియె.

298


క.

బకమా గృహ దఖిలకదం, బకమా యాహారవిధికిఁ బాసిటుల సరో
నికటమున నూరకుండెద, వకటా యిది యేమి యనిన నది యిట్లనియెన్.

299


ఉ.

యీదశ యెట్లుగాఁ దెలిసి తీవు కుళీరమ నిక్కువంబు మ
త్స్యాదుఁడ వృత్తి నా కిదియయైనను నీయెడ నేమి చెప్ప ద
త్తాదృతి నీయవస్థ కరయం గత మున్నది విన్ము జాలరుల్
మేదురశక్తి నిక్కొలనిమీనములం గొనిపోవువారలై.

300


క.

పలువురు రానున్నారని, తెలియ న్విని చెప్పవచ్చితి న్మీతో నిం
దులకయి యాహారింపం, దలఁపక వలవంత నొందెదం గర్కటకా.

301


క.

జాలములన్ గాలముల, న్మీలెల్లం బొలియకున్నె మృత్యుసమం బీ
జాలి యెటనుండి వచ్చెం, గాలము దరియింపరాదు గద యెవ్వరికిన్.

302
  1. నూష్మకరమయిన యీమహాగ్రీష్మమునను (పాఠాంతరము)