పుట:నారాయణీయము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19


పాకమువలె మధురముగాఁ గానవచ్చినను నారికేళపాకమునకు సచ్ఛాయమై యలరారుచుండుట సం స్తవనీయము.

దీని తరువాతి పద్యములో సంస్కృతపదములతో నిమిత్తము లేకుండనే యచ్చ తెలుఁగు జాతీయములో నెంత వ్యంగ్య మిముడ్పబడినదో యరయ కుండుట యెట్లు ?

"ఓహరిణాక్షి! నీ వెవతవో యమృత మ్మిది పంచు మంచు వ్యా
 మోహము సెంది. మైమఱచి పొందిక డగ్గఱి వేడు వారి స
 న్నాహముఁ జూచి వాడవదిన౯ నను నమ్మిన నవ్వుబాటు సం
 దేహములేదు . అటంచు నె పదింబది నమ్మికపుచ్చి తందఱ౯."

'కులటాస్మి' అను మూలమునందలి కులట (= ఱంకులాఁడి) యను పదమునందలి నైచ్యము వాచ్యముగాక వ్యంగ్యమగునట్లు “ వాడవదిన౯' అని ప్రయోగించుట రమ్యతరము నగుచున్నది. 'వెఱ్ఱివానియాలు వాడవదినె' అని సామెత ప్రకారము వాడలోని వారి కందఱకు వదినె వావిదగుననికదా ప్రసిద్ధి! మఱియు -

“పాయని పొంగుతో నమృతపాత్రము వారటు తెచ్చి చేతి కం
 దీయఁగఁ జేతఁగాదు అబల నే-నెవిసేయఁగఁబోయి యేమిగాఁ
 జేయుదునో యటంచు"

అను పల్కులలో ఏమిచేయఁబోయి యేమి చేయుదునో యనుమాత్రమే కాక అమృతము పంచుటలో ఏమి కాఁజేయుదునో అనఁగా మీకందనట్లు అంతయు నపహరింతు నేమో యని ధ్వని కూడఁ గలదు. వారిని నమ్మించినదని మాత్రమే మూలమున నుండఁగా ఆ నమ్మించుట యెట్లో యనువాదమున వివరింపఁబడినది. "చేతకాని యబలను మీపని సక్రమముగా జేయఁగలనో లేదో" అని ముందుగాఁ జెప్పియుండుట చేత నే అమృతపానమునకై యెంత యుత్కంఠితులైనను దేవతలకుఁ బూర్తియగుదాఁక నసురు లోర్చి యుండఁగల్గిరన్నమాట. కొన్ని యెడల మూలమున కిట్లే వ్యాఖ్యా పాయమై యీ యనువాదము వన్నె మీఱుచున్నది. 'బలినిగ్రహ' ఘట్టమున వామనుని గని బలి “నీ కేమి కావలె"నని యడుగుచున్న వద్యమందలి యనుప్రాసమే కాదు, అర్ధమును నెంత సహజమగు ధోరణిలో నడచినదో! కవిత్వధార యెంత ధారాళముగా నవతరించినదో పరిశీలించి, యానందింపక తప్పనిది.