పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

గలిగె నాసురుచికి గారాపుబిడ్డఁ డొ
క్కరుఁడు మోహరాశి కవితమూర్తి
తండ్రితొడలమీఁద దా ముద్దు గులుకంగ
ధ్రువుఁడు చేరవచ్చి వివశుఁడైన.

11


వ.

ఉత్తానపాదుండు సురుచికి నోడి యుపేక్షించిన.

12


క.

పతి చాగఁ దెలిసి సురుచియు
నతిగర్వగ్రంథి యగుచు నాధ్రువుఁ గని నీ
చతనున్న నీకుఁ దగునా
తతమగు నుచ్ఛైర్మనోరథం బో వత్సా!

13


క.

నీ కిది ప్రియమై యుండిన
నా [1]కడుపునఁ బుట్టి యతిఘనంబగు తప మీ
లోకములు మెచ్చఁ జేసినఁ
జేకూరుంగాక చింత చేసిన గలదే.

14


మ.

అతియోగ్యత్వము నీకుఁ గల్గినను నేఁ డయ్యో సవత్నీతనూ
జతదూష్యత్వము నొందినాఁడ వతులైశ్వర్యంబుచే రాజు నీ
చతరుంగా నినుఁ జూచె; విత్తు లధికశ్లాఘ్యంబు లైనన్ నిరా
కృతముల్ గావె ఘనోషరస్థలుల నాకీర్ణంబుగాఁ జల్లినన్.

15


క.

ఈరాజాంకమునకు సుకు
మారుఁడు శూరుండు నాకుమారుఁడు దగు; వీఁ
డే రా జగు నీధరణీ
భారమునకు; నీకు నింకఁ బాత్రత గలదే?

16


వ.

అనిన రాజు నట్లనే సమ్మతించిన సామర్షదుఃఖాశ్రుధారోరస్కుండై
మాతృగృహంబునకు నేఁగి తల్లి యడిగిన, సురుచిదుర్వచనంబులు
విన్నవించిన, వ్యథ నొంది సునీతి మెల్లన నిట్లనియె.

17


ఆ. వె.

అన్న! దుఃఖ మేల యాసురుచి యథార్థ
మైనయట్ల పల్కె; నల్పభాగ్య
నామురారి గొల్వ నట్లౌట కాత్మాప
రాధ మది సహింప నర్హ మనఘ!

18
  1. బుట్టినఁ బుట్టి