పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

తనమహిమ సర్వసత్యసంతతి చెలంగ
ధరణిఁ బాలించె నురుధనధాన్యవృద్ధి
మన్నుఁ గనకంబుగా నాజ్ఞ మధువిరోధి
చక్రమును బోలి జితదిశాచక్రమునను.

159


ఆ.

అంతరంగమునను హరిభక్తియును బహి
రంగమునను నవజ్ఞయత్నములను
గా నటించి దైత్యగణముల నందఱ
మోసపోవఁజేసె నాసురారి.

160


తే. గీ.

సంశయాన్వితవస్తుల శాస్త్రమే ప్ర
మాణ మగుఁగాన పరశాస్త్ర మహితమతులు
బాహ్యవృత్తి కువృత్తియై పరఁగియున్నఁ
దలఁచి రాతని సద్గుణోత్తరునిగాను.

161


మ.

భువనోత్కృష్టున కాసురారిమణికిన్ బుత్రీమణిన్ దేవతా
యువతీమోహిని నిచ్చె నంత నపు డయ్యుత్తానపాదావనీం
ద్రవతంసంబు వివేకసద్గుణలసత్కల్యాణఁగల్యాణి వై
ష్ణవి నత్యుత్తమపుణ్యలగ్నమున హస్తం బందె దైత్యుం డిలన్.

162


తే. గీ.

మణిమయోజ్జ్వల దాస్థానమండపమున
నుత్సవాగతశాస్త్రవాదోత్కనత్క
దంబములతోడ నప్పు డాడైత్యమౌళి
యఖిలదర్శనసిద్ధాంత మరయఁ జూచి.

163


సీ.

చామరగ్రాహిణిసంధూతచామరా
                       నిలము హల్లోలకుంతలముఖాంబు
జంబు కుండలమణిచాకచక్యమున న
                       లంకరింపుచు నలకంబు మహిమ
కల్యాణసమయయోగ్యంబగు కామరూ
                       పముఁ దాల్చి లలితశోభావిలాస
రూపలావణ్యకలాపయౌ కల్యాణి
                       యాకారగర్వంబు నపనయించి