పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

మత్ప్రియైకప్రయోజనుల్ మన్నియోగ
గరిమఁ గృతయుగమున దితికశ్యపులకు
నల హిరణ్యకశిపు హిరణ్యాక్షు లనఁగఁ
గలిగెదరు ఘోరవీరరక్షఃప్రవరులు.

105


తే. గీ.

అందు నగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డతని
యపరజుండు హిరణ్యాక్షుఁ డతిరజస్త
మఃప్రకృతు లుగ్రశౌర్యులు మత్తులప్ర
మత్తు లసురలు భజియింతు రట్టి ఘనులు.

106

ప్రహ్లాదుని చరిత్రము

సీ.

ప్రహ్లాదుఁ డనఁగ సద్భాగవతోత్తముం
                       డాదైత్యునకు సుతుఁడై జనించు
ధర్మవత్సలుఁ డనాఁ దనరిన బ్రాహ్మణుం
                       డతఁడు పూర్వభవంబునందు నీశ
తత్త్వధీమూలమై తనరు నకామ్యక
                       ర్మములు బాహ్యంగమై యమర శమద
మాదిసద్గుణరాజి యంతరంగం బగు
                       భక్తి నాయందుఁ గన్పట్టె నిలిచి


తే. గీ.

భూమి ప్రారబ్ధకర్మముల్ భోగ మక్ష
యింపఁజేయుచు మత్ప్రేరితేద్ధబుద్ధి
నుండి బ్రాహ్మణసభయందు నొక్కనాఁడు
తనదు విద్యావిలాస మంతయును నెఱపి.

107


చ.

అనఘునిఁ గర్మకాండరతుఁడై తగు నుత్తము ధర్మబంధుసం
జ్ఞుని మునివాది నొక్కని యశోనిధి డగ్గఱి యాగమాంతశో
భనమతమార్గధుర్యత సభాస్థలి గెల్చిన నాతఁ డాగ్రహం
బున శపియించె దైత్యకులముఖ్యుఁడ వయ్యెద వంచు నుగ్రతన్.

108


క.

శాపం బొసంగి పశ్చా
త్తాపంబు వహించి మౌని ధర్మవివేకో
ద్దీపితుని బ్రహ్మవిద్యా
రూపుని నె ట్లాడితిని సరోషాత్ముఁడనై.

109