పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అంత నాతఁడు మృదుశీతలాంబుధార
నల్లనల్లనఁ గోరి ఛాయావిశాల
సాలసాలంబు మించి పంచాశదుచ్చ
పురుషమానోన్నతి వహించి పొదలియున్న.

116


తే. గీ.

అన్నగచ్చాయ నుత్తరీయంబు పఱచి
దానిమీఁదట శీతవాతంబు విసర
నిద్రవోవంగఁ దపనుఁ డస్తాద్రిఁ జేరె
నంధతమసంబు నిండె దిశాంతరముల.

117

రత్నావళివృత్తాంతము

వ.

అప్పు డొక్కరాక్షసుండు కాశీపతిపుత్త్రి రత్నావళి యనునది దౌత
పాదయై పరీతశిరస్కయై నిద్రింపుచు వలయంబులు రెంటను బది
రత్నంబులును, నీవియందుఁ బదియేడురత్నంబులును, సీమంతంబున
నేడురత్నంబులును, గేయూరంబునం బదుమూఁడురత్నంబులును
బూని మెఱుపువలె నొఱుపు చూపం బతికామయై తగినపతి లేక పరి
తపించుచు నున్నదాని దశాననుండు సీతంబోలె హరించి మొఱలిడ
నంకంబున నిడికొని మత్పతియున్న సాలంబుచెంత సర్వైశ్వర్య
సమన్వితంబై మయనిర్మితరత్నమయచిత్రమందిరంబై కనకశయ
నాసనశోభితంబై పద్మరాగపాత్రంబై బహువృక్షసమాకీర్ణంబై బహు
భక్ష భోజ్యాభిరామంబై పరిఫుల్లహల్లకోత్పలవిభూషితహంసకారండ
చక్రవాకోపశోభితతీరసారవనవిరాజితపుణ్యనదీశోభితంబైన యొక
గుహ సొచ్చి కుసుమశయ్యపై రాజకన్య నునిచె నంత నారాక్షసుని
భార్య చూచి భర్తం గనుంగొని దీని నేమి కారణంబునం దెచ్చితి
వే నుండ? సపత్నీదుఃఖంబు సహింపనేర్చునే? యని యాగ్రహించు
గృహిణిం జూచి ప్రియభాషల లాలించి యిది భక్షణార్థంబుగా సంపా
దింపఁబడియె. ద్విజుం డొకండు దైవవశంబున నాహారంబుగాఁ
జేరినవాఁడు. వానిం దెమ్ము భక్షించెద ననఁ దద్వాక్యంబులు విని
చెఱగొని తెచ్చిన యారాజకుమారి యేకతంబున నిట్లనియె.

118


శా.

మిథ్యావాక్యము పల్కె నీవిభుఁడు దుర్మేధావధానంబుతో
దథ్యం బయ్యెనె నీకు? నీదుముదిమిం దర్కించి చంచద్గుహా
వీధ్యంతస్థలి నుండ రోసి విడిచెన్ వేషంబు దూషింపుచున్
దథ్యం బింతయు రాక్షసోద్వహనకృత్యం బో సరోజాననా!

119