పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదీయపురాణము

పంచమాశ్వాసము

క.

శ్రీమహితోపనిషద్వి
ద్యామయ! నిత్యప్రకాశితైశ్వర్య శ్రీ
సామ్యగ్రీకార్మణ! శ్రీ
వామాక్షీహృదయసదన! వనరుహవదనా!

1


వ.

అవధరింపుము. వసిష్ఠుండు మాంధాతకు నెఱింగించిన క్రమంబున
నూతుండు శౌనకాదుల కిట్లనియె.

2

చాతుర్మాస్య వ్రత మహత్వము

మ.

తతి వర్ణించితి కార్తికవ్రతమహత్త్వఖ్యాతధర్మంబు ప్ర
స్తుతమై యుండఁగఁ దెల్పు మింక నృపచాతుర్మాస్యపుణ్యవ్రతం
బతిలోకం బనవద్య మప్రతిమ మి ట్లాకాల మేదాన మీ
క్షితిలోఁ జేసినఁ బూర్ణమై వెలయు భక్తిన్ నా కెఱింగింపవే.

3


వ.

అనిన.

4


సీ.

వాసి నయాచితవ్రతుఁడును నక్తభో
                       క్తయునైనవాఁ డనురక్తి బ్రాహ్మ
ణులకు భోజన మిడి నూత్నబలీవర్ధ
                       మొక్కటి పసిఁడితో నొసఁగవలయు
నట్లు బ్రాహ్మణభోజనానంతరమున న
                       మాంసభోజనుఁడైన మానవుండు
ధేనువు దక్షిణ దీవించ నర్పించఁ
                       దగు నాకు లెల్లఁ జోద్యము వహింప