పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కలిమియ యపరాధం బగుఁ
గలియుగమున నట్లు గాన ఘనులగు ధనవం
తులపై రాజులు పాపం
బులు దలఁచి ధనంబు గొండ్రు భూవలయమునన్.

129


క.

ఎడయక నిజేష్టదేవత
యెడ జనకుని[1]యెడల తల్లియెడ గురునియెడన్
బొడమదు మోహం బింతుల
యెడఁ గల్గిన యట్లుగా మహీవలయమునన్.

130

కలియుగధర్మము

వ.

[2]మఱియుఁ గలియుగంబున భరతాదివిద్యలే కాని వేదశాస్త్రపురాణా
ధ్యాత్మవిద్యలు సంభవింపవు. నవయౌవనదుర్దాంతమానసలై
యువతులు ముదిసినయత్తమామలం గైకొనరు. గుణవతులైన భార్యల
విడిచి పరదారానురాగంబునం బతులు పతితు లగుదురు. ధర్మార్థంబు
లేశంబేని పాత్రులకు నొసంగరు. ప్రశంసార్థంబు గాని నరకోత్తారణంబైన
హరిస్మరణంబు సేయరు. నరకప్రదదారస్మరణంబు గాని శూద్రద్వార
పాలకవేత్రహస్తనివారితులై బాహ్యస్థలంబున నుండు బ్రాహ్మణు
లేమి చెప్ప? రాజసేవోన్మత్తులైనవారు విష్ణుభక్తిపరాయణులు పల్కిన
పల్కులెల్ల నాక్షేపింతురు. ద్విజాధములు నారాయణు వర్ణించి దేవ
తాంతరసేవకులై యుంద్రు. దుష్టద్రవ్యంబుచేత దుర్గారాధనక్రియలు
హరిబాహ్యులగు నృపద్విజులు ప్రాణిహింసచేఁ గావింపుదురు. శ్మశాన
దేవతార్చనంబు శ్రేయస్కరం బని యొనరింపుదురు. హరిపదం
బెఱుంగక యహోరాత్రంబు స్వోదరపూరకులై నరులు వర్తింపుదురు.
సమస్తజగన్నాయకుండైన నారాయణుండు గలుగఁ గవు లొక్కొక్క
నరాధముని వర్ణింపుదురు. స్త్రీలకుఁ బాపమతియు నతిక్లేశంబు నగు.
ధనహీనులైన భర్తల వర్జింపుదురు. కులకాంతలు ప్రమదలై భర్తలు
గలిగియు నన్యపురుషస్పృహతో నుందురు. పర్జన్యుం డల్ప
వర్షంబును సస్యాల్పఫలంబునుంగాఁ గురియు. ఇట్లు నారమాధీశ్వ
రుండు తనలీలచేత యాదవగిరినుండి తద్వేత్రహస్తులు ద్వాపరాంతం
బునం గలిపురుషుండు వచ్చిన వారింపుదురు. విష్ణుపరాయణులైన
వారు యదుగిరీశ్వరుని సేవింపఁగలరని వర్ణించి మఱియు నిట్లనియె.

131
  1. నతని
  2. మఱియు వేదశాస్త్రపురాణాధ్యాత్యవిద్యలు కలియుగంబున భరతాదివిద్యలు గాని