పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అందు ననురక్తిఁ గంటిన్
గందర్పసహస్రతుల్యకాయు నమేయున్
బృందారకమౌనిసభా
మందారకమైన దివ్యమంగళమూర్తిన్.

159


వ.

ఆమూర్తి యస్మద్గృహదేవతామూర్తియ కాని యితరమూర్తి గాదని
ప్రశంసించినఁ గృష్ణుం డిట్లనియె.

160


క.

ఈరీతి నేల పల్కెదు
సీరీ! యస్మత్కులధనసేవధి యగు ల
క్ష్మీరమణమూర్తితో సరి
గా రూపించితివి యదునగప్రభు నిచటన్.

161


తే. గీ.

అన్న! క్రొత్తమాట లాడితివనిన నీ
తోడు నిజము నిజము దూరతరమె
కదలి చనుట భాగ్యకరమని వారించి
యరిగి రపుడు విగ్రహంబు[1]తోడ.

162


వ.

అరిగి తద్దివ్యమంగళవిగ్రహంబు నారాయణగిరి హరిసన్నిధానం
బున నిలిపి మూర్తివైషమ్యంబుఁ గానక కలహంబు లుడిగి రామకృష్ణులు
తద్విగ్రహంబు లన్యోన్యంబునుం గలసియుండె. తదన్యోన్యసంగమం
బున నీశైలం బధికోచితవైభవంబగు రూపంబు గాంచె నది గాన
యాదవాచలంబు నందఱు సేవింపుదురు. మున్ను నారాయణగిరియై
యున్నయది నాఁడు మొదలుకొని యాదవాద్రి యన విలసిల్లె. ఈ
యాగమంబు వినినం, బఠియించినన్ గుణవంతుఁడై, ధనికుండై, ధర్మ
చారియై, పిత్రాద్యుత్తారకుండై, నారాయణపరాయణుండైన కొడుకును,
గనకమాలిని సమానయైన కన్యకం గాంచి యంతంబున వైకుంఠపదం
బునందు, పెక్కులు పలుకనేల? రామకృష్ణుల కటాక్షంబున సకల
సంపదలును గలుగు. వారిని దైత్యు లెదిరింప వెఱతురు. సురలు
మ్రొక్కుదురు. పూర్వాపరవంశంబులు పది తరింపంజేయుం గావున
నీయాదవాద్రిశిఖరికులశిఖరంబున మహావైభవంబున మమ్ము నుత్సు
కులఁ జేయు విష్ణుదివ్యరూపంబులు రెండు నుండు నన విని మునులు
నారదున కిట్లనిరి.

163
  1. గాను