పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

తలఁచి సనత్కుమారుని ముదంబునఁ జూచి విరించి నాకుఁ బు
త్రులు జనియింప రెందఱు బుధుల్ [1]ఘను లందఱలోన నీవు కే
వలముగ జ్ఞానభక్తిరసవాసన మించి సదామనంబులో
పలఁ బ్రియవృత్తి నుందు నిను బ్రహ్మవిదున్ వినుతింప శక్యమే.

64


క.

సన్మతి నారాయణుఁ డా
జన్మధనంబై చరించు సాత్వికుఁడు తనూ
జన్ముఁడు వంశమహాపా
పోన్మూలనకరుఁడు పొగడ నొరులకు వశమే.

65


తే. గీ.

అని విమానంబుఁ బ్రియతనూజార్పితంబు
సేయ నూహించి యొకయింతచింత నొందఁ
బుండరీకాక్షుఁ డాశ్రితపోషకుండు
పల్కుల సుధారసము చిల్కఁ బల్కె నపుడు.

66


క.

ఏల విషాదము నొందెదు
బాలక! యిది యిమ్ము పరమభాగవతసభా
మౌళిమణికి నీ కిత్తు ద
యాళుత నొకదివ్యవిగ్రహముఁ గొను మింకన్.

67

శ్రీహరి తనయర్చామూర్తిని మఱియొకదానిని బ్రహ్మ కనుగ్రహించుట

తే. గీ.

అనుచుఁ గమలాగళాభరణాంకశాలి
యైన నిజకరమున నిచ్చె నాత్మదివ్య
విగ్రహముఁ బద్మజునకు నావిగ్రహంబు
చక్కఁదనమునకై యాత్మఁ జొక్కె నలువ.

68


తే. గీ.

అందుకొని [2]శ్రీమహీమోహనాభిరామ్య
శాలి నాదేవుఁ గొల్చె నాజలజభవుఁడు
వాణి సావిత్రియు నొసంగు వళితలలిత
కలితకంజాతమాలికల్ [3]గట్టవైచి.

69
  1. ఘను లందఱిలోన
  2. శ్రీమహిళామోహనాభిరామ్య — గణభంగము
  3. గట్టి