పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0400-6 పాడి సంపుటం: 11-600

పల్లవి: అందుకే పో నవ్వు వచ్చీ నప్పటనుండి
         అందుకు మొక్కఁ బోతేను ఆయములు సోఁకెఁగా

చ. 1: సంగడా లెత్తినచేయి చాఁచేవు మావురముపై
       నంగనలము మా చన్ను లంత కోపునా
       యెంగిలితమ్మ రాలెను యింతలో నీచేతిమీఁద
       సంగతి నేమో సేయఁగ సరి నేమో యాయఁగా

చ. 2: విరులు ముడిచి నట్టిసిరసు మాతొడమీఁద
       నెరవుగఁ బెట్టుకొని నిద్దరించేవు
       పొరి నాపాదాలమీఁద బూవు లెల్ల రాలఁగాను
       దొరతనానకు రాఁగా దొమ్మిపూజ లాయఁగా

చ. 3: గందము పూసినమేను కాఁగిట నన్నుఁ గూడఁగ
       చిందే నా చెమట నీపై చిప్పిలఁగను
       అందపు శ్రీవెంకటేశ అలమేల్‌మంగను నేను
       కందువఁ గూడితి విట్టె కత లై నిలిచెఁ గా