పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-4 సామంతం సంపుటం: 11-430

పల్లవి: చేరి మందెమేళ మెంత సేసేవు మమ్ము
         మేరకు మేరే కాక మిక్కి లింత చెల్లునా

చ. 1: చివ్వన నీ కూడిగాలు సేసేకాంతలలోన
       నెవ్వరిఁ బోలుదు నేన న్నేల పట్టేవు
       యివ్వల నీ వే మన్న నెదు రాడఁ జాలఁ గాక
       దవ్వుల నుండిననన్ను దగ్గరి రాఁ దీతురా

చ. 2: అంచెల నీతో నవ్వే యాపాటివారమా
       పొంచి నన్ను నెంత సేసి పొగడేవు
       ముంచి బలిమి సేయఁగా మోనానల నుండితిఁ గాక
       మంచ మెక్కి నీసరుస మాట లాడేదాననా

చ. 3: కొంగు వట్టేవు నీకాలిగోరఁ బోరఁ గలనా
       యెంగిలి మా మోవితేనె లేల ముట్టేవు
       అంగవించి శ్రీవెంకటాదిప కూడితి నన్ను
       మంగిటినిధానము వై ముట్టి నన్నుఁ బాయవూ