పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0301-05 వసంతవరాళి సం: 04-005 అంత్యప్రాస

పల్లవి:
     ఏమందు మిందుకు నెఱిఁగినదే తొల్లి
     శ్రీమాధవుఁడ నీవు సేసినదే తొల్లి

చ. 1:
    వొక మానఁ జేఁదూ వొక మానఁ దీపూ
    కకిపికలై రెండూ గలవే తొల్లి
    వొకనికజ్ఞానము వొకనికి జ్ఞానము
    సకలానఁ గలుగుట సహజమే తొల్లి
            
చ. 2:
    పగలు వెలుఁగు పైపై రాత్రి చీఁకటి
    నిగిడి లోకములను నిజమే తొల్లి
    మొగి సురలకు మేలు ముంచి దైత్యులకుఁ గీడు
    తగిలి నోసలివ్రాఁత తప్పదిది తొల్లి

చ. 3:
    వెన్నెలలు చంద్రునందు వెడ యెండసూర్యునందు
    కన్నుల లోకమువారు గన్నదే తొల్లి
    యెన్నఁగ శ్రీవేంకటేశ యేలినవాఁడవు నీవు
    వున్నవారు నీకింద నున్నవారు తొల్లి