పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         రేకు:0301-04 బౌళి సం: 04-004 అధ్యాత్మ

         పల్లవి:
               నిజమో కల్లో నిమిషములోననే
               భజించు వారల భాగ్యము కొలఁది
         
         చ. 1:
              వొకఁడు కనుదెరచి వున్నది జగమను
              వొకఁడు కన్నుమూశోగి లేదనును
              సకలము నిట్లనె సర్వేశ్వరుఁడును
              వెకలినరులు భావించినకొలది

         చ. 2:
              కడుపు నిండొకఁడు లోకము దనిసె ననును
              కడుపు వెలితైనఁ గడమను నొక్కఁడు
              తడవిన నిట్లనే దైవమిందరికి
              వెడగునరులు భావించిన కొలఁది
         
          చ. 3:
              ముదిసి యొకఁడనును మోక్షము చేర్వని
              తుదఁ బుట్టొకఁడది దూరమనును
              యెదుటనే శ్రీవేంకటేశ్వరుఁ డిట్లనే
              వేదకి నరులు భావించిన కొలది