పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9050-02 పళమంజరి సం: 04-565 జోల

పల్లవి:

పాలజలనిధిలోఁ బాయని
నీలవర్ణుఁడవట నీవా యిపుడు

చ. 1:

వెదచల్లుమణుల వేయిపడగలను
చెదరని మెరుఁగుల శేషునిపై
మృదువు బరపుగా మెల్లనె పొరలుచు
నిదురవోదువట నీవా యిపుడు

చ. 2:

పరమ మునీంద్రులుఁ బద్మభవాదులు
ఇరువంకల నుతియించఁగను
అరవిరిమోమున నల్లన నవ్వెడి
నిరతమూర్తివట నీవా యిపుడు

చ. 3:

పగటున సిరియునుఁ బరగిన ధరణియు
బిగియుచు నడుగులు పిసుకఁగను
తగు వేంకటగిరిఁ దనరుచు జెలఁగెడి
నిగమమూర్తివట నీవా యిపుడు