పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-04 గుజ్జరి సం: 04-450 శరణాగతి

పల్లవి:

హరిహరి నిను సకలాంతర్యామివి ఆత్మఁదలఁచుటేయోగంబు
శరణాగతరక్షామణి నిన్నే శరణని యెడిదే తుదిపదము

చ. 1:

నీయందే యీసచరాచరమును నీవే చరాచరమందు నిత్యమును
పాయక వుండుట గని తలపోయుట పరమార్థంబుల సారంబు
కాయము జీవుఁడు నీయధీనమై కలుగఁగఁ బ్రకృతియుఁ బురుషునిఁగానిటు
మాయల ముంతువు మాయకుఁ జొరవని మతిఁ దలపోయుట సుజ్ఞానంబు

చ. 2:

తనలోఁ బరతత్వపు నీవును తా నీపరతత్వములోపలఁగా
మనసునఁ దలఁచుట వేదాంతంబుల మంతనముల సన్మార్గంబు
ఘనమునకును మరి ఘనమై యందే కడుసూక్ష్మమునకుఁ గడు సూక్ష్మంబై
యెనసిన పూసలలోదార మవని యెన్నుటె పరమరహస్యంబు

చ. 3:

ఆతుమలోపల ఘనవైకుంఠము ఆతుము నీ వైకుంఠములోపల
యీతల నాతల సరిగాఁదెలియుట యిదియే బ్రహ్మానందంబు
శ్రీతరుణీశ శ్రీవేంకటపతి సేవారతి నిను నీ భజియించెద
దాతపు దైవమవై ననుఁగావుము తలఁచెద మిదియే తత్వంబు