పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-02 గుండక్రియ సం: 04-448 ఉపమానములు

పల్లవి:

సిబ్బితి పడఁగనేల చింతలఁ బొరలనేల
గొబ్బున మొదలి నీరు కొనకెక్కదా

చ. 1:

నెలవై తత్వార్థము నే నెరఁగకుండినాను
తలఁపులోపలివాఁడు తా నెరుఁగుఁగా
అలసి దేహమున నే నశుచినై యుండినాను
యిల నాయంతరియామి యెప్పుడూ శుచేకా

చ. 2:

తిరమై నేను దివ్యదేశముల నుండకున్న
ధర నాలోఁ బరమాత్మ తానుండుఁగా
నిరతి గుణముల నే నీచుఁడనైనాను
అరయ నాపాలిహరి యధికుఁడేకా

చ. 3:

వొగి నేఁ బరత్రంత్రుఁడనై వుండినాను నాలోన
తగిన స్వతంత్రుఁడు తాఁ గలఁడు గా
వెగటై నే నుండినా శ్రీ వేంకటేశుఁ డెదుటనే
వగలెల్లఁ దీర్చి వైవశమాయగా