పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-03 లలిత సం: 04-323 శరణాగతి

పల్లవి:

తెలిసియుఁ దెలియదు దేరిన చిత్తము
నలినాక్ష గోవింద ననుఁగావవయ్యా

చ. 1:

యేఁకట నినుగొలిచి యితరుల వేఁడనేల
వేఁకపుటాసల నాలోవెలితిగాక
చీఁకటివాసినమీఁద చీఁదరగొనఁగనేల
మాఁకువంటివెడబుద్ది మాన దిదేమయ్యా

చ. 2:

పొంచి నీదాసుఁడనై యల్పుల వేఁడఁబోనేల
చంచలగుణములనాజాలిగాక
అంచలఁ దెరువుకని యడవిఁబడఁగనేలా
యించుకంత యేవవుట్ట దేమిపాపమయ్యా

చ. 3:

మతిలో నీవుండఁగాను మాయలఁ బొరలనేలా
వెతకి తెలియని నావేఁదురుగాక
గతియై శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను
తతి నాతపమనేఁడు దరిచేరెనయ్యా