పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-02 లలిత సం: 04-322 మనసా

పల్లవి:

దొరకినయప్పుడే తుదగాక
మరుగకుమెన్నఁడు మరి మనసా

చ. 1:

తనుభోగంబులఁ దనిపినపిమ్మట
వెనుకొని హరిఁ దడవేనంటే
దినమునుఁ దను నింద్రియములచల మిది
తనియుట యెన్నఁడు దగు మనసా

చ. 2:

తిరమగునాల దీరినపిమ్మట
తెరలి విరతిఁ బొందే నంటే
మరలని యాశామయ మీచిత్తము
విరతి యెన్నఁడిఁక వెడ మనసా

చ. 3:

ముదిసినపిమ్మట మొగి శ్రీవేంకట -
సదయుఁ గొలుతు నిచ్చలునంటే
హృదయము శ్రీవేంకటేశునినెల విది
యిదిగనుటెన్నఁడు యీమహి మనసా