పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0305-06 మాళవిగౌళ సం: 04-030 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

విచారించుకొనేవారి వివేకాల కొలఁదులు
పచారించి వున్నవెల్ల భావనమాత్రములు

చ. 1:

జగములన్ని నీశరీరమేకనక
తగు వైకుంఠాలే వుండేతావు లెల్లాను
పొగరు స్వర్గ నరకభూములనే లోకాలెల్ల
పగటున తమలోని భావనమాత్రములు

చ. 2:

అన్ని పదార్థాలు నీయందే పుట్టివచ్చేఁగాన
తిన్నని నీప్రసాదాలే దినభోగాలు
వన్నెల నిష్టానిష్ట వస్తుభేదము లెల్లాను
పన్నుకొన్న యటువంటి భావనమాత్రములు

చ. 3:

అంతరాత్మవు శ్రీవేంకటాధిప నీవేకాన
చెంతల నీ కైంకర్యాలే చేఁతలెల్లాను
వింతలైన సంసార విహారములెల్లాను
బంతినే నానావిధ భావనమాత్రములు